తిరుత్తణి: ఆడినెల ప్రారంభంతో తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కావళ్ల సందడి నెలకొంది. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆడి కృత్తిక వేడుకలు ప్రసిద్ధి చెందింది. ఐదు లక్షలకు పైబడిన భక్తులు కావళ్లతో తిరుత్తణికి విచ్చేసి స్వామికి కావళ్లు చెల్లించి దర్శించుకుంటారు. కాగా శుక్రవారం ఆడినెల ప్రారంభంతో ఆదివారం సెలవు దినం సందర్భంగా భక్తులు కావళ్లతో కొండకు పోటెత్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు వేలాదిగా భక్తులు మెట్లు మార్గంతో పాటు ఘాట్‌రోడ్డులో కొండ ఆలయం చేరుకున్నారు. దీంతో కొండ ఆలయ మాడ వీధుల్లో కావళ్లతో భక్తజనం సందడి నెలకొంది. సర్వదర్శన క్యూలైన్‌లలో మూడు గంటల పాటు, రూ. 100 ప్రత్యేక దర్శన క్యూలైన్‌లలో రెండు గంటలు వేచివుండి కావళ్లు చెల్లించి భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు. రాత్రి ఉత్సవర్లు స్వర్ణ రథంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కాగా భక్తుల రద్దీతో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ సమస్య చోటుచేసుకుని ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈసీఆర్ ఇస్కాన్‌లో
జగన్నాథ రథయాత్ర
సాక్షి, చైన్నె : చైన్నె ఈసీఆర్‌లోని ఇస్కాన్ ఆలయం ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానిక ప్రజలు, యువత ,మహిళలు భాగస్వాములయ్యారు. మధ్యాహ్నం 2:30 గంటలకు రథోత్సవ ప్రారంభ వేడుకలు జరిగాయి. అనంతరం మధ్యాహ్నం 3:00 గంటలకు చిన్న నీలాంకరై సమీపం నుండి అలంకరించిన జగన్నాథుని రథం బయలుదేరింది. భక్తజనం నడుమ సాగిన ఈ ఊరేగింపు ఈంజంబాక్కంలోని ఈసీఆర్ ఇస్కాన్ ఆలయానికి చేరుకుంది. రథయాత్ర సాగినంత సేపూ భక్తుల హరినామ సంకీర్తనలు, భజనలు, నృత్యాలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తులంతా భక్తిభావంతో జగన్నాథుని నామాలను స్మరిస్తూ రథాన్ని లాగే పవిత్ర సేవలో భాగస్వాములయ్యారు. జయపతాక స్వామి మహారాజ్, భాను స్వామి మహారాజ్‌ల ఆశీస్సులతో ఈ ఉత్సవం దిగ్విజయంగా జరిగింది. ఈసీఆర్ ఇస్కాన్ ఆలయానికి రథం చేరుకున్న తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజలు, మహా హారతి నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులందరికీ భారీగా ప్రసాద వితరణ చేశారు.
ఎల్‌నినో ప్రభావంపై అధ్యయనం
రంగంలోకి నిపుణుల కమిటీ
సాక్షి, చైన్నె: వాతావరణ మార్పులు, ఎల్ నినో వల్ల కలిగే ప్రభావాలపై అధ్యయనం చేసేందుకు ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి సెంగోట్టయ్యన్ ప్రకటించారు. ఈరోడ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ కీలక సమాచారాన్ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని అతలాకుతలం చేస్తున్న ఎల్ నినో ప్రభావం రాష్ట్రంపై ఎలా ఉండబోతుందనే దానిపై ఈ నిపుణుల కమిటీ సమగ్రంగా అధ్యయనం చేయనుందన్నారు. ఈ ప్రభావం వల్ల భవిష్యత్తులో తలెత్తే కరువు లేదా అకాల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు, ప్రభుత్వం తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఈ కమిటీ ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను సమర్పిస్తుందని పేర్కొన్నారు. ఇదే వేదికపై మహిళల సంక్షేమ పథకాల గురించి ఆయన మాట్లాడుతూ.. మహిళల హక్కుల నిధుల కోసం వస్తున్న దరఖాస్తులను ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ దరఖాస్తులన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారని, అర్హులైన ప్రతి ఒక్క మహిళకు ఈ పథకం వర్తించేలా నిధులు అందజేస్తామని సీఎం సెంగోట్టయ్యన్ స్పష్టం చేశారు.


