సాక్షి, చైన్నె: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందస్తు అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల చేరిక అడ్మిషన్లు జరిపిన 3 ప్రైవేట్ లా కాలేజీల గుర్తింపును తమిళనాడు డాక్టర్ అంబేడ్కర్ లా యూనివర్సిటీ రద్దు చేసింది. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రకటించారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి? తమిళనాడు డాక్టర్ అంబేడ్కర్ లా యూనివర్సిటీ నిబంధనల ప్రకారం.. లా కాలేజీలలో అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టేటప్పుడు కొన్ని కఠినమైన విధివిధానాలను అనుసరించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉత్తర్వులతో పాటు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తుది అనుమతి ఉంటేనే విద్యార్థులను చేర్చుకోవాల్సి ఉంటుంది. యూనివర్సిటీ నిబంధనల ఆధారంగా గత విద్యా సంవత్సరంలో కింది 3 కాలేజీలకు తాత్కాలిక గుర్తింపు ఇవ్వనున్నారు. ఇందులో తూత్తుకుడికి చెందిన తులసి మహిళా లా కాలేజీ, తెన్కాశీకి చెందిన ఎస్. తంగపళం లా కాలేజీ, కన్యాకుమారి చెందిన ముఖిల్ లా కాలేజీ ఉన్నాయి.
నిబంధనల ఉల్లంఘన
భారత న్యాయవాద మండలి అనుమతి ఎలాగూ వచ్చేస్తుంది కదా అనే ముందస్తు అంచనాతో కాలేజీలు ఎలాంటి అడ్మిషన్లు జరపకూడదని యూనివర్సిటీ నిబంధనలు, తాత్కాలిక గుర్తింపు నిబంధనలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. అయితే, ఈ నిబంధనలను బేఖాతరు చేస్తూ సదరు 3 కాలేజీలు విద్యార్థులను చేర్చుకోవడం యూనివర్సిటీ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. యూనివర్సిటీ సిండికేట్ తీర్మానం ప్రకారం.. నిబంధనలు ఉల్లంఘించిన ఈ మూడు కాలేజీలపై తగిన చర్యలు తీసుకోనున్నారు. ఇందులో భాగంగా అదనపు విద్యార్థుల చేరికల కోసం ఇచ్చిన తాత్కాలిక గుర్తింపును తక్షణమే రద్దు చేశారు. అంతేకాకుండా, రాబోయే 2026–27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక గుర్తింపును పొడిగించాలంటూ తూత్తుకుడి తులసి మహిళా లా కాలేజీ పెట్టుకున్న దరఖాస్తును అసలు పరిశీలించవద్దని యూనివర్సిటీ పాలక మండలి తీర్మానం చేసింది. ఈ నిర్ణయంతో అనుమతులు లేకుండా అడ్మిషన్లు జరిపే ప్రైవేట్ విద్యాసంస్థలకు లా యూనివర్సిటీ గట్టి హెచ్చరిక పంపినట్లయ్యింది.


