వ్యవసాయ మాదిరి బడ్జెట్‌ | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ మాదిరి బడ్జెట్‌

Jul 21 2026 1:18 AM | Updated on Jul 21 2026 1:18 AM

● పీఎంకే విడుదల

సాక్షి, చైన్నె: పీఎంకే నేతృత్వంలో వ్యవసాయ మాదిరి బడ్జెట్‌ను సోమవారం విడుదల చేశారు. తమిళనాడులో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధి కోసం రూ. 1.5 లక్షల కోట్ల నిధులను కేటాయించాలని పీఎంకే ఈ బడ్జెట్‌ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. వివరాలు.. ఏటా బడ్జెట్‌ సమావేశాలకు ముందుగా మాదిరి బడ్జెట్‌ను పీఎంకే విడుదల చేయడం జరుగుతున్నది. ఇందులో అనేకఅంశాలను పాలకులు పరిగణనలోకి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ పరిస్థితులలో టీవీకే ప్రభుత్వం ఆగస్టులో ఆర్థిక, వ్యవసాయ బడ్జెట్‌లను సభలో దాఖలు చేయడానికి సిద్దం అవుతున్నది. ఈ పరిస్థితులలో పీఎంకే నేతృత్వంలో ఆ పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రాందాసు సోమవారం మాదిరి బడ్జెట్‌ను రైతు సంఘాల నేతలతో కలిసి విడుదల చేశారు.

బడ్జెట్‌ అంచనాలు – నిధుల కేటాయింపు

పీఎంకే రూపొందించిన ఈ వ్యవసాయ మాదిరి బడ్జెట్‌ మొత్తం విలువ రూ. 93,000 కోట్లు. ఇందులోరూ.68,000 కోట్లు వ్యవసాయ రంగానికి, మరో రూ.25,000 కోట్లు నీటి వనరుల శాఖ ద్వారా సాగునీటి ప్రాజెక్టుల కోసం కేటాయించారు. తమిళనాడు ప్రభుత్వం గత బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయించిన రూ.15,230.30 కోట్లతో పోలిస్తే ఇది 446 శాతం ఎక్కువ. మొత్తం నిధులలో రూ.13,000 కోట్లు రైతులకు ఉత్పాదక సబ్సిడీల (ఇన్పుట్‌ సబ్సిడీ) కోసం, రూ. 25,000 కోట్లు వ్యవసాయ మౌలిక సదుపాయాలు, పరిశోధనల కోసం, అలాగే రూ. 30,000 కోట్లు పంట బీమా వంటి ఇతర పథకాల కోసం ప్రతిపాదించారు.

రైతులకు ప్రత్యేక రాయితీలు –

గిట్టుబాటు ధరలు

మెట్టూరు డ్యామ్‌ నుండి నీటి విడుదల లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న కురువై (ఖరీఫ్‌) రైతులకు అదనపు ఖర్చుల నిమిత్తం ఎకరానికి రూ.5,000 ప్రత్యేక సబ్సిడీ ఇవ్వాలని కోరారు. భూగర్భ జలాలు లేక సాగు చేయలేకపోయిన రైతులకు ఎకరానికి రూ.10,000 నష్టపరిహారం అందించాలని ప్రతిపాదించింది. క్వింటాల్‌ వరి కొనుగోలు ధరను రూ.3,500కు, అలాగే టన్ను చెరకు ధరను రూ. 5,000 కు పెంచాలని డిమాండ్‌ చే శారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు, ప్రభుత్వం అన్ని రకాల పంటలను కొనుగోలు చేయడాన్ని తప్పనిసరి చేస్తూ ‘వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు చట్టం–2026’ తీసుకురావాలని కోరారు.

మౌలిక సదుపాయాలు –

ఇతర కీలక ప్రతిపాదనలు

రాబోయే ఐదేళ్లలో వ్యవసాయం, హార్టికల్చర్‌ రంగాలలో 50 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టిని లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్ని జిల్లాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ (ఆహార శుద్ధి) పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. కావేరి రక్షిత వ్యవసాయ మండలిని 9 జిల్లాలకు విస్తరించాలని కోరారు. కోయంబత్తూరులో ఇప్పటికే ఉన్న అగ్రికల్చర్‌ యూనివర్సిటీతో పాటు తంజావూరు, వేలూరు, నైల్లె (తిరునెల్వేలి) నగరాల్లో కొత్తగా 3 వ్యవసాయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వికసిత్‌ భారత్‌ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని దినాలను 125 నుండి 150 రోజులకు పెంచాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు ‘పసుమై తమిళగం’ (గ్రీన్‌ తమిళనాడు) పథకం కింద రాబోయే ఐదేళ్లలో 300 కోట్ల మొక్కలను నాటాలని ప్రతిపాదించారు. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగ వాటాను రాబోయే ఐదేళ్లలో 20 శాతానికి పెంచేలా ఈ బడ్జెట్‌లో ప్రణాళికలు రూపొందించినట్లు పీఎంకే తెలిపింది. తాము సూచించిన 226 రకాల సలహాలను పరిశీలించి, ఆగస్టులో ప్రవేశపెట్టబోయే తమిళనాడు ప్రభుత్వ అధికారిక వ్యవసాయ బడ్జెట్‌లో చేర్చాలని పీఎంకే నేత అన్బుమణి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement