సాక్షి, చైన్నె: తమిళనాడు కాంగ్రెస్ కమిటీని బలోపేతం చేసే దిశగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని కొత్త జిల్లా నాయకులను అధిష్ఠానం నేరుగా ఎంపిక చేసింది. కొత్త రక్తాన్ని చేర్చడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం ధీమా వ్యక్తం చేస్తున్నది.
మహాబలిపురంలో 10 రోజుల శిక్షణ శిబిరం
ఇప్పటికే టీఎన్‌సీసీకి కొత్త అధ్యక్షుడిగా మాణిక్యం ఠాకూర్ నియమితులయ్యారు. అలాగే, ఎంపికై న 77 మంది కొత్త జిల్లా నాయకులకు 10 రోజుల పాటు ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహించనున్నారు. ఈ శిక్షణా శిబిరం ఈ నెల 23వ తేదీ నుండి ఆగస్టు 1వ తేదీ వరకు మహాబలిపురంలో జరగనుంది. ఈ 10 రోజుల శిబిరంలో ఒక రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
క్షేత్రస్థాయి నాయకుల ఎంపిక
శిక్షణా శిబిరం ముగిసిన అనంతరం స్థానిక, నగర, గ్రామ స్థాయి నాయకులను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రతి జిల్లాకు ప్రత్యేక ప్రతినిధులను నియమించనున్నారు. ఈ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యటించి, పరిశీలన జరిపిన అనంతరం అర్హులైన అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తారు. ఆ తర్వాతే రాష్ట్ర అధ్యక్షుడి ఆమోదంతో అధికారిక నియామకాలు జరుగుతాయి. రాబోయే రెండు నెలల్లోగా ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని పార్టీ యోచిస్తోంది. దీని ద్వారా స్థానిక, పట్టణ మరియు పరిసర ప్రాంతాల నాయకులుగా సుమారు వెయ్యి మందిని నియమించనున్నారు. రాష్ట్ర స్థాయి నిర్వాహకులను కూడా వీలైనంత త్వరగా నియమించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. రాష్ట్ర నిర్వాహకులను నియమించి దాదాపు 8 సంవత్సరాలు కావొస్తుండడంతో, ఈసారి కొత్త వారికి కూడా అవకాశం కల్పిస్తారనే అంచనాలు ఉన్నాయి.


