లోపాల వల్లే అధిక కరెంట్‌ బిల్లులు | - | Sakshi
Sakshi News home page

లోపాల వల్లే అధిక కరెంట్‌ బిల్లులు

Jul 21 2026 1:18 AM | Updated on Jul 21 2026 1:18 AM

● అధికారులకు చీఫ్‌ ఇంజనీర్‌ ● చర్యలు తప్పవని హెచ్చరిక

ఉత్తర్వులలో వివరాలు

సాక్షి, చైన్నె: తమిళనాడులో విద్యుత్‌ మీటర్ల రీడింగ్‌ , బిల్లింగ్‌ ప్రక్రియలో చోటుచేసుకున్న లోపాల కారణంగానే వినియోగదారులకు భారీగా కరెంట్‌ బిల్లులు వచ్చాయని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన తిరునెల్వేలి ప్రాంత విద్యుత్‌ శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్త ప్రభుత్వ పథకం – గందరగోళం:

తమిళనాడులో కొత్తగా టీవీకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని, ఈ పథకం 500 యూనిట్ల లోపు వాడే వారికి వర్తిస్తుందని ప్రకటించారు. 500 యూనిట్లకు పైగా వినియోగించే వారికి ఎప్పటిలాగే 100 యూనిట్లు ఉచితంగా లభిస్తాయని తెలిపారు. అయితే, ఈ ప్రకటన తర్వాత సాధారణం కంటే చాలా ఎక్కువ మొత్తంలో కరెంట్‌ బిల్లులు వస్తున్నాయని ప్రజలు సోషల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యుత్‌ బోర్డు తొలి వివరణ:

ఎండ తీవ్రత వలన విద్యుత్‌ వినియోగం పెరగడం వల్లే బిల్లులు ఎక్కువగా వచ్చాయని, తక్కువగా వాడిన వారికి తక్కువ బిల్లులే వచ్చాయని విద్యుత్‌ బోర్డు తొలుత సమర్థించుకుంది. అయితే, విద్యుత్‌ బోర్డు సమర్థనల మధ్య, తిరునల్వేలి రీజియన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ విడుదల చేసిన నివేదికలో అసలు లోపాలను అంగీకరించారు. విద్యుత్‌ శాఖలోని కొన్ని విభాగాల్లో జరుగుతున్న అసాధారణ బిల్లింగ్‌ పద్ధతుల వలన ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు సరైన తనిఖీలు చేయకపోవడం, విద్యుత్‌ పంపిణీ వృత్తాల పరిధిలో సమగ్ర సమీక్షలు నిర్వహించకపోవడం వలననే ఈ పొరపాట్లు జరిగాయని స్పష్టం చేశారు.

కఠిన చర్యలకు ఆదేశం:

ప్రధాన కార్యాలయం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించడంలో అధికారులు విఫలమయ్యారని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై, సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలతో కూడిన కఠిన చర్యలు తీసుకుంటామని చీఫ్‌ ఇంజనీర్‌ హెచ్చరించారు. అంతేకాకుండా, ఇకపై ప్రతి విభాగంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, ఉన్నతాధికారులు తమ పరిధిలోని సిబ్బంది పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సూపర్‌ వైజింగ్‌ ఇంజనీర్లను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement