సాక్షి, చైన్నె : పుదుచ్చేరిలో ఇకపై అసెంబ్లీ ఎన్నికలే అవసరం లేదని, , కేవలం సీఎం ఎంపికకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తే సరిపోతుందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ వైద్యలింగం వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే అన్ని అధికారాలూ తనకే కావాలని సీఎం రంగస్వామి భావించడమేనని ఎద్దేవా చేశారు. ఆదివారం పుదుచ్చేరి కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక జంగిల్ రాజ్ పాలన సాగుతోందన్నారు.
రేషన్ దుకాణాలు – స్మార్ట్ మీటర్ల వివాదం
రాష్ట్రంలో రేషన్ దుకాణాలను పూర్తిస్థాయిలో తెరిచి, ప్రజలకు సక్రమంగా బియ్యం పంపిణీ చేయాలని ఆయన డిమాండ్‌చేశారు. అలాగే రేషన్ షాపుల ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలన్నారు. విద్యుత్ శాఖలో ప్రవేశపెడుతున్న స్మార్ట్ మీటర్ల ఖర్చును వినియోగదారుల నుంచే వసూలు చేయబోతున్నారా? లేదా విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేసేందుకు ఇది తొలి అడుగా? అనే విషయాలపై సీఎం, గవర్నర్ స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పుష్కరాల నిర్వహణ కోసం 48 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. ఎంతో చిన్న ప్రాంతమైన యానాంలో ఈ ఉత్సవాలను నిర్వహించాలనుకోవడం సరికాదని, పుదుచ్చేరిలోని తిరుకాంచి ప్రాంతంలో దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో అత్యంత వైభవంగా ఈ పుష్కర వేడుకలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే పుదుచ్చేరి ప్రభుత్వం హిందూ సమాజాన్ని మోసం చేసినట్లే అవుతుందన్నారు. ఇక, రాష్ట్రంలో సాగుతున్న నకిలీ మందుల మాఫియా వెనుక రాజకీయ హస్తం ఉందని ఆరోపించారు. డీఎంకే, బీజేపీతో కూటమి కట్టబోతోందా అనే ప్రశ్న వారినే అడగాలని ఓ ప్రశ్నకు సమాధానంగా వ్యాఖ్యానించారు. విజయ్ నేతృత్వంలోని టీవీకేతో కూటమి గురించి ప్రశ్నించగా తదుపరి ప్రకటిస్తామన్నారు.
ఆసక్తికర అంశం
ఈ ప్రెస్ మీట్ ప్రారంభానికి ముందు ఒక విచిత్రమైన ఘటన జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యలింగం ప్రెస్ మీట్ కోసం సమయానికే వచ్చినప్పటికీ.. పుదుచ్చేరి కాంగ్రెస్‌కు ఉన్న ఏకై క ఎమ్మెల్యే కార్తికేయన్ రాకకోసం గంటన్నర పాటు వేచి చూడాల్సి వచ్చింది. ఆయన వచ్చిన తర్వాతే సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కార్తికేయన్, మాజీ ఎమ్మెల్యేలు బాలన్, అనంతరామన్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


