తమిళనాడులో రైలు ప్రయాణికులకు దక్షిణ రైల్వే సేవలు మరింత విస్తృతం కానన్నాయి. రాష్ట్రంలోని అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు , రైళ్ల సంఖ్యను పెంచేందుకు కార్యాచరణ సిద్ధంచేశారు.ఇందులో భాగంగా రూ. 2,576 కోట్ల మొత్తం వ్యయంతో మూడు ప్రధాన రైల్వే లైన్ ప్రాజెక్టులకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల కోసం దక్షిణ రైల్వే త్వరలోనే భూసేకరణ ప్రక్రియను , టెండర్ల ప్రక్రియను ప్రారంభించనుంది.
సాక్షి, చైన్నె: దక్షిణ రైల్వే పరిధిలో చైన్నె ఎగ్మూర్, తాంబరం నుంచి నిత్యం దక్షిణాది జిల్లాలు,నగరాల వైపుగారైళ్లు పట్టాలెక్కతూ వస్తున్నాయి. అలాగే , ఎంజీఆర్‌సెంట్రల్‌నుంచి అరక్కోణం, కాట్పాడి మీదుగా పశ్చిమ తమిళనాడు వైపు జిల్లాలు,నగరాలకు రైళ్ల సేవలు జరుగుతున్నాయి. అలాగే, ఉత్తర, ఈశాన్య , పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణ, కేరళ వైపుగా వెళ్లే రైళ్లు, ఇతర రైళ్ల రాక పోకలు నిత్యం జరుగుతూ వస్తున్నాయి. దీంతో దక్షిణ రైల్వే మార్గాలు నిత్యం ట్రాఫిక్ రద్దీతో ఉంటాయి. ఇక్కడ కొత్త ప్రాజెక్టుల దిశగా విస్తృత చర్యలు చేపడుతూనే వస్తున్నారు. తాజాగా మరో మూడు ప్రాజెక్టులకు దక్షిణ రైల్వే రూపురేఖలను సిద్ధంచేసి కేంద్రానికి పంపించగా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆమేరకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపిన 3 కీలక ప్రాజెక్టుల వివరాలు..
తాంబరం – చెంగల్పట్టు నాలుగో రైల్వే లైన్:
చైన్నె శివారు ప్రాంతాల్లో అత్యంత రద్దీగా ఉండే తాంబరం – చెంగల్పట్టు మార్గంలో రూ. 713 కోట్ల అంచనా వ్యయంతో 4వ కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ లైన్ అందుబాటులోకి వస్తే సబర్బన్ (లోకల్ ఎలక్ట్రిక్ ) రైళ్ల సర్వీసులు మరింతంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మార్గంలో నిత్యం దక్షిణాది రాష్ట్రాల నుంచి తాంబరం, ఎగ్మూర్‌కు వచ్చేరైళ్లే కాదు, చైన్నె బీచ్ వైపుగా చెంగల్పట్టు నుంచి సాగే ఎలక్ట్రిక్ రైళ్ల సేవలు ఎక్కువగానే ఉంటూ వస్తున్నాయి.
అరక్కోణం – చెంగల్పట్టు డబుల్ ట్రాక్:
అరక్కోణం– చెంగల్పట్టు మధ్య ప్రస్తుతం ఉన్న లైన్‌ను రూ. 929 కోట్ల వ్యయంతో డబుల్ ట్రాక్ (రెండు లైన్ల మార్గం)గా మార్చనున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో సింగిల్ ట్రాక్ ఉండటంతో రైళ్ల రాక పోకలు అంతంత మాత్రమే. తిరుమాల్ పూర్ వరకు ఎలక్ట్రిక్ రైళ్ల సేవలు సాగుతున్నప్పటికీ, ఎక్స్ ప్రెస్ రైళ్ల సేవలు ఈ మార్గంలో అంతంత మాత్రమే. తాజాగా డబుల్ ట్రాక్ అందుబాటులోకి వచ్చిన పక్షంలో అత్యధిక రైళ్లను నడిపేందుకు వీలుంది.
ఈరోడ్ – కరూర్ డబుల్ ట్రాక్:
పారిశ్రామికంగా ఎంతో కీలకమైన నగరాలుగా ఈరోడ్ , కరూర్‌లున్నాయి. ఈరోడ్ – కరూర్ రైల్వే మార్గాన్ని కూడా రూ. 934 కోట్ల వ్యయంతో డబుల్ ట్రాక్ లైన్ ప్రాజెక్ట్‌గా మార్చేందుకు రైల్వే శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఇది పారిశ్రామిక ప్రగతికి మరింత దోహదకరంగా ఉండటమే కాకుండా, ప్రయాణికుల సేవార్థం అదనపు రైళ్లను నడిపేందుకు వీలుంది.
2030 నాటికి 50 శాతం అదనపు రైళ్లు
దక్షిణ రైల్వే అధికారుల వివరాల మేరకు ప్రస్తుతం దక్షిణ రైల్వే పరిధిలో ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, ఎలక్ట్రిక్ రైళ్లతో కలిపి ప్రతిరోజూ దాదాపు 1,400 రైళ్లు నడుస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలోనే 152.75 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించగా రూ. 8,215 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం తమిళనాడులోని తిరుచ్చి మదురై, కేరళలోని పాలక్కాడ్ డివిజన్లలో వివిధ రైల్వే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, 2030 నాటికి ఈ పనులన్నీ పూర్తయితే ప్రస్తుతం ఉన్నదానికంటే 50 శాతం అదనంగా రైళ్లను నడపడం సాధ్యమవుతుందని అధికారులు స్పష్టం చేశారు. అదే విధంగా తాజాగా ఆమోదం తెలిపిన ప్రాజెక్టులను సైతం 2030 నాటికి ముగించే దిశగా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసిఉన్నారు.


