‘ప్రైవేట్‌’లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్‌ | - | Sakshi
Sakshi News home page

‘ప్రైవేట్‌’లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్‌

Jul 20 2026 12:32 AM | Updated on Jul 20 2026 12:32 AM

● చట్టానికి అన్బుమణి డిమాండ్‌

సాక్షి, చైన్నె: తమిళనాడులో కొత్తగా ఏర్పాటు చేసే ప్రైవేట్‌ పరిశ్రమలు, వాణిజ్య సంస్థల ఉద్యోగాలలో 75 శాతం స్థానిక తమిళ యువతకే కేటాయించేలా అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం చట్టం తీసుకురావాలని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాసు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఈ విషయంగా ఆయన స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ కొత్త పారిశ్రామిక విధానంపై వస్తున్న వార్తలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్‌ రంగంలో స్థానిక యువతకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని కొందరు అధికారులు, పెట్టుబడిదారులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ఇది నిజమైతే సామాజిక న్యాయానికి జరిగే ద్రోహమని ఆయన మండిపడ్డారు. దేశంలో కొత్త ఆర్థిక విధానాల వల్ల ప్రభుత్వ రంగాలు ప్రైవేటీకరణ అవుతున్నాయని, ఉద్యోగాల కోత విపరీతంగా పెరిగిపోయిందని అన్బుమణి గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో చదువుకున్న యువత ప్రైవేట్‌ ఉద్యోగాలపైనే ఆధారపడాల్సి వస్తుందని పేర్కొన్నారు. అయితే ప్రైవేట్‌ సంస్థలు స్థానిక యువతను వదిలేసి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికులను తక్కువ జీతాలకు చేర్చుకుంటున్నాయని ఆరోపించారు. ఈ అన్యాయాన్ని అరికట్టేందుకు ప్రైవేట్‌ రంగాటో 80శాతం స్థానిక రిజర్వేషన్లు ఇవ్వాలని పీఎంకే గత పదేళ్లుగా పోరాడుతోందని గుర్తుచేశారు.

హామీని నిలబెట్టుకోవాలి..

సీఎం విజయ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఒక కీలక హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రైవేట్‌ సంస్థల్లో స్థానిక తమిళ యువతకు 75శాతం ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు జీఎస్టీలో 2.5శాతం, విద్యుత్‌ ఛార్జీల్లో 5శాతం రాయితీ ఇస్తామని చెప్పారని వివరించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అయితే కొందరు అధికారులు, పెట్టుబడిదారులు కలిసి ఈ పథకాన్ని ఆదిలోనే తుంచేయాలని చూస్తున్నారని విమర్శించారు. 2021 ఎన్నికల సమయంలో డీఎంకే కూడా ఇలాంటి హామీనే ఇచ్చిందని, కానీ స్థానికులకు రిజర్వేషన్లు ఇస్తే విదేశీ పెట్టుబడులు రావంటూ అధికారులు ఇచ్చిన తప్పుడు సలహాల వలన ఆ చట్టాన్ని తీసుకురాలేకపోయిందని అన్బుమణి వ్యాఖ్యానించారు. ఫలితంగా తమిళనాడుకు ఆశించిన పెట్టుబడులు రాలేదు సరే కదా.. బీహార్‌, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ వంటి ఉత్తరాది రాష్ట్రాల యువతతో ఇక్కడి ప్రైవేట్‌ ఉద్యోగాలు నిండిపోయాయని, తమిళ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే తప్పును పునరావృతం చేయకూడదని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement