గంజాయి అక్రమ రవాణా
తిరువళ్లూరు: పూందమల్లి బస్టాండ్‌లో అనుమానాస్పదంగా బ్యాగుతో సంచరించిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు వారి నుంచి 15 కిలోల గంజాయిని సైతం స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పూందమల్లి బస్టాండులో విసృతంగా గంజాయి విక్రయాలు, రవాణా జరుగుతున్నట్టు పోలీసులకు రహస్య సమాచారం అందింది., పోలీసులకు అందిన సమాచారం మేరకు అక్కడ ప్రత్యేక నిఘాను ఉంచారు. ఈ సమయంలో అనుమానస్పదంగా సంచరిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో పట్టుబడిన యువకులు మధురైకు చెందిన మహ్మద్‌ఖైఫ్(23), తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండికి చెందిన నవాస్(20), మెయిద్దీన్(21) తిరువణ్ణామలైకు చెందిన శిలంబరసన్(24)గా గుర్తించారు. వీరి వద్ద వున్న బ్యాగులో 15 కిలోల గంజాయి వున్నట్టు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నలుగురిని రిమాండ్‌కు తరలించారు.
అగ్గిపెట్టెల గోదాములో
అగ్ని ప్రమాదం
అన్నానగర్: కోవిల్‌పట్టి సమీపంలోని ఓ అగ్గిపెట్టెల గోడౌన్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఓ నవ వరుడు సజీవ దహనం కాగా, మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టి సమీపంలోని పాండవరమంగళం పసువంతనై రోడ్డులో మణికంఠన్ (31)కు అగ్గిపెట్టెల ఫ్యాక్ట రీ ఉంది. దీనికి ఎదురుగా ఫ్యాక్టరికి చెందిన అగ్గి గిడ్డంగి ఉంది. మంగళవారం ముగ్గురు కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా మంటలు చెరేగాయి. ముగ్గురు కార్మికులు మంటల్లో చిక్కుకుని కేకలు వేశారు. దీనిని చూసిన స్థానికులు దిగ్బ్రాంతితో ఈ విషయం గురించి కోవిల్‌పట్టి అగ్ని మాపక కేంద్రం నాలట్టిన్ పుత్తూరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది చాలా సేపు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. వారు లోపలికి వెళ్లి చూసేసరికి, ఒక వ్యక్తి చనిపోయి కాలిపోయి కనిపించాడు. మిగతా ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ ప్రమా దంలో మరణించిన వ్యక్తి విజయపురికి చెందిన కార్తీక్ (27) అని, అతనికి కొన్ని రోజుల క్రితం వివాహం జరిగిందని తేలింది. గాయపడిన వారు దురైసామిపురానికి చెందిన గణేష్‌న్ (47) శివకాశిలోని పెర్నాయక్కన్‌పట్టికి చెందిన సుడలై ముత్తు (42) అని కూడా వెల్లడైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తూత్తుకుడి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుడలైముత్తు (42), గణేషన్ (47)లకు ప్రత్యేక చికిత్స అందించాలని కూడా సీఎం స్టాలిన్ ఆదేశించారు. మృతుడి కుటుంబానికి రూ. 4 లక్షలు, తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందించాలని ఉత్తర్వులిచ్చారు.
క్యాన్సర్ చికిత్సలో కొత్త విప్లవం
సీఏఆర్ అండ్ టీ సెల్ థెరపీ
సాక్షి, చైన్నె: రోగి సొంత కణాలతోనే క్యాన్సర్‌పై సమరంతో కొత్త విప్లవానికి ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు నాంది పలికాయి. సీఏఆర్ అండ్ టీ సెల్ థెరపీని విజయవంతం చేశారు. సాంప్రదాయ చికిత్స విఫలమైన చోట నెక్ట్స్ జెన్ ఇమ్యునో థెరఫీ ప్రాణం పోస్తున్నట్టు ఆ ఆస్పత్రి మెడికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ ఎం.ఏ. రాజా వివరించారు. మంగళవారం ఆయన ఈ విధానం గురించి వివరిస్తూ, ప్రెసిషన్ ఆంకాలజీ రంగంలో చైన్నె అగ్రగామిగా ఎదుగుతోందన్నారు. తమ వైద్యులు అత్యంత సంక్లిష్టమైన సెల్ థెరఫీని విజయవంతంగా నిర్వహించి, ప్రాణాంతక స్థితిలో ఉన్న ఇద్దరు వృద్ధ రోగులను కాపాడారని వివరించారు. సాధారణ కీమోథెరపీ విఫలమైన చోట, ఈ తదుపరి తరం సెల్యులార్ థెరపీ అద్భుత ఫలితాలను అందించిందన్నారు. ఇది ఒక వ్యక్తీగరించిన ఇమ్యునోథెరపీ అని, ఇందులో రోగి శరీరం నుండి రోగ నిరోధక కణాలను సేకరించి, వాటిని జన్యుపరంగా మార్పు చేస్తారని వివరించారు. ఇలా మార్చిన కణాలు శరీరంలోకి తిరిగి ప్రవేశించిన తర్వాత, క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని నాశనం చేస్తాయని, ఇది రోగికి కొత్త రోగనిరోధక వ్యవస్థను అందిస్తుందన్నారు. ఎనిమిది నెలలుగా లింఫోమాతో బాధపడుతున్న 70 ఏళ్ల , డిఫ్యూజ్ లార్జ్ బి–సెల్ లింఫోమాతో బాధపడుతున్న 62 ఏళ్లు వృద్ధులకు ఈ థెరపీ మంచి ఫలితాల్ని ఇచ్చినట్టు ప్రకటించారు. సమావేశంలో సీఏఆర్ అండ్ టీ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ సుమన్ కళ్యాణ్. ఎన్ , బీఎంటీ కన్సల్టెంట్ డాక్టర్ ఎం గోపీనాథన్‌లు పాల్గొన్నారు.


