గుండాయాక్ట్ దుర్వినియోగం
సాక్షి, చైన్నె: గుండా చట్టం నమోదుకు తాజాగా చిక్కులు ఎదురైంది. దురుద్దేశంతో కేసులు నమోదైన పక్షంలో సంబంధిత పోలీసు అధికారిపై చర్యలు తప్పదని మద్రాసు హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. గుండాయాక్ట్ దుర్వినియోగం అవుతోన్నట్టుగా పేర్కొంటూ, తీవ్ర ఆగ్రహాన్ని న్యాయమూర్తి వ్యక్తం చేశారు. వివరాలు.. ఒకే వ్యక్తి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నా, రౌడీ షీటర్లుగా వీరంగాలు సృష్టిస్తున్నా, ప్రజల్ని భయ కంపితుల్ని చేసే విధంగా వ్యవహరిస్తున్నా, అతి పెద్ద నేరాలకు పాల్పడ్డా, ఇతరత్రా కీలక నేరాల్లో చిక్కినా, పైరసీలకు పాల్పడినా... అలాంటి వారిపై గుండా చట్టం ప్రయోగిస్తున్నారు. ఒక్కసారి గుండా చట్టం నమోదైన పక్షంలో విచారణతో సంబంధం లేకుండా, సంబంధిత నింధితుడు ఏడాది కాలం పాటూ ఎలాంటి బెయిల్ లేకుండా కారాగారానికే పరిమితం కావాల్సి ఉంటుంది. అలాగే ఇటీవల సైబర్ నేరాలకు పాల్పడే వాళ్లు, ఏటీఎం, క్రెడిట్ కార్డుల మోసాలు, ఆన్‌లైన్ మోసాలు చేసే వారిని, మహిళలపై సాగుతున్న లైంగిక అరాచకాలు, దాడులకు పాల్పడే వారిని సైతం గుండా చట్టం పరిధిలోకి తెచ్చే విధంగా పోలీసు యంత్రాంగం నిర్ణయాలు తీసుకుంది. అలాగే పోలీసులపై దాడులకు పాల్పడితే గుండా చట్టం ప్రయోగించే పనిలో పడ్డారు. అదే సమయంలో ఈ చట్టం దుర్వినియోగం అవుతోందన్న ఆరోపణలు ఉన్నాయి.
కోర్టులో పిటిషన్..
వారాహి అనే యూట్యూబర్‌ను ఇటీవల చైన్నె పోలీసులు బెదిరింపు, మోసం తదితర కేసులో అరెస్టు చేశారు. ఆయనపై గుండాయాక్ట్ ప్రయోగానికి చైన్నె పోలీసు కమిషనర్ అరున్ ఆదేశించారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వారాహి సతీమణి నీలిమ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ మంగళవారం న్యాయమూర్తులు సుబ్రమణియన్, ధనపాల్ బెంచ్‌లో విచారణకు వచ్చింది. యూ ట్యూబర్ వారాహి పోలీసులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ రావడంతోనే ఆయనపై దురుద్దేశంతో గుండాయాక్ట్‌ను ప్రయోగించారని నీలిమ తరపు న్యాయవాదులు వాదనను వినిపించారు. ఈ పిటిషన్‌కు వివరణ ఇవ్వడానికి సమయం ఇవ్వాలని ప్రభుత్వ తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో న్యాయమూర్తులు తీవ్రంగానే స్పందించారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తే గుండాయక్ట్ నమోదు చేస్తారా? అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దురుద్దేశ పూర్వకంగా, ఇష్టానుసారంగా వ్యవహరించి గుండాయాక్ట్‌ను ప్రయోగించే పోలీసు అధికారులపై ఇక శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని హోంశాఖను ఆదేశించారు. వారాహికి మూడు నెలల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ, సమగ్ర వివరాలతో వివరణ ఇచ్చేందుకు 12 వారాల పాటూ ప్రభుత్వానికి గడువు విధించారు.


