క్లుప్తంగా
చైన్నె, ప్యారిస్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు
తిరువొత్తియూరు: చైన్నె పూకడై (ఫ్లవర్ బజార్) ప్యారిస్ ఎస్‌ఎస్‌సీ బోస్ రోడ్డులో పాదచారుల మార్గంలో 500కు పైగా దుకాణాలు ఆక్రమించారు. ఈ ప్రాంతంలో నగర బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు వెళ్లేటప్పుడు తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీంతో బాధితులైన ప్రజలు చైన్నె కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. పాదచారుల మార్గంలో ఉన్న ఆక్రమణ దుకాణాలను తొలగించి, దానికి సంబంధించిన పత్రాలను సమర్పించాలని కేసును విచారించి కోర్టు ఆదేశించింది. దాని ఆధారంగా మంగళవారం ఉదయం చైన్నె కార్పొరేషన్ రాయపురం జోనల్ ప్రాంత కార్యనిర్వాహక ఇంజినీర్ పళని, సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్ కణ్ణన్, సహాయ ఇంజనీర్ కార్తీక్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ ఉద్యోగులు పోకై ్లన్ యంత్రంతో సంబంధిత ప్రదేశానికి వెళ్లారు. ఆ తర్వాత, వందకు పైగా పారిశుద్ధ్య కార్మికుల సహాయంతో పాదచారుల మార్గంలోని దుకాణాలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో పూకడై ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూకడై ఫ్లవర్ బజార్ డిప్యూటీ కమిషనర్ సుందరవడివేల్ ఆదేశాల మేరకు సహాయ కమిషనర్ దక్షిణామూర్తి ఆధ్వర్యంలోవందకు పైగా పోలీసులు మోహరించారు.
గెట్ ఫిట్ డేస్‌తో
ఫిట్‌నెస్ ప్రయాణం
సాక్షి, చైన్నె: గెట్ ఫిట్ డేస్ తో ఫిట్ నెస్ ప్రయాణానికి శ్రీకారం చుట్టామని అమెజాన్ ఇండియా ప్రకటించింది. అమెజాన్.ఇన్‌లో 2026 కొత్త ఏడాది సందర్భంగా విస్తృత శ్రేణి క్రీడ, ఫిట్ నెస్ అప్ గ్రేడ్ ఉత్పత్తులను గురించి మంగళవారం నిర్వాహకులు స్థానికంగా ప్రకటించారు. యోనెక్స్, లైప్ లాంగ్, వంటి అనేక బ్రాండ్ల ఉత్పత్తులను కొలువ దీర్చనున్నామని వివరించారు. ఏఐ ఆధారిత ఆవిష్కరణ, వినియోగ దారుల రేటింగ్, అనుభవాల మద్దతుతో ఎంపికను విస్తరిస్తున్నామన్నారు. అమెజాన్ ఇండియా స్పోర్ట్స్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాయప్ప మాట్లాడుతూ, జనవరి 1 నుంచి వినియోగ దారులకు వివిధ మార్గాలలో అద్బుతమైన సేవలను అందించనున్నామని వివరించారు. క్రీడా పరంగా, ఫిట్ నెస్ పరంగా గెట్ ఫిట్ డేస్‌తో మరింతగా ప్రయాణాన్ని విస్తృతం చేయనున్నామన్నారు.
మలేషియా పర్యటనకు రండి!
సాక్షి, చైన్నె: 2026 కొత్త సంవత్సరంలో పర్యాటక వీక్షణ నిమిత్తం మలేషియాకు తరలి రావాలని చైన్నెలోని మలేషియా టూరిజం డైరెక్టర్ హిషాముద్దీన్ ముస్తఫా పిలుపు నిచ్చారు. చైన్నెలోని మలేషియా కాన్సుల్ జనరల్ కె శరవణ కుమార్ తో కలిసి మంగళవారం ఆయన తమ దేశ పర్యాటక ప్రగతి, కొత్త వేడుకలు , ఏడాది పొడవున పర్యాటక అంశాలను గురించి వివరించారు. దక్షిణభారత దేశం అంతటా అద్భుతమైన కార్యక్రమాలను మలేషియా నేతృత్వంలో నిర్వహించామని పేర్కొన్నారు. 125 వ్యూహాత్మక సమావేశాలు, 42 ప్రమోషనల్ ఇనిషియేటివ్‌లు, 31 రిపబ్లిక్ రిలేషన్స్ కార్యక్రమాలు, 36 బ్రాండ్ విజిబిలిటీ ప్రయత్నాలతో టూరిజం మలేషియా చైన్నెలో మరుపు రాని పర్యటనను వేదికగా చేయనున్నట్టు వివరించారు. దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాల నుంచి మలేషియాకు 148 ప్రత్యక్ష విమాన సేవలు జరుగుతున్నాయని గుర్తు చేశా రు. డిసెంబరు 2026 వరకు వీసా రహిత ప్రయాణం పొడిగించడం జరిగిందన్నారు. బలమైన విమాన కనెక్టివిటీతో 2026లో 2 మిలియర్ల సందర్శకులను ఇక్కడి నుంచి మలేషియాకు ఆహ్వానించడం లక్ష్యంగా ఏర్పాట్లు చేపట్టామని వివరించారు. బి2బీ చొరవలు,సైక్లింగ్ ఈవెంట్‌లు,రోడ్ షోలు, డిజిటల్ ప్రచారా లు, వీఎంవై 2026కు శక్తిని కలిగించే విధంగా ముందుకెళ్లనున్నామన్నారు. విజిట్ మలేషియా 2026 పేరిట పర్యాటకంగా మరిన్ని ఆహ్వానా లు,అవకాశాలు కల్పించనున్నామని తెలిపారు.
వృద్ధురాలి హత్య
– మనవడి కోసం పోలీసుల గాలింపు
అన్నానగర్: వృద్ధురాలిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ట్రంకు పెట్టెలో దాచిపెట్టిన ఘటన కడలూరులో కలకలం రేపింది. వివరాలు.. కడలూరు సమీపం వి. కాట్టుప్పాలై యామ్ గ్రామానికి చెందిన మణి. ఇతని భార్య చిన్నపొన్ను (75). వీరికి ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. అందరూ వివాహితులు. ముగ్గురు కుమారులు సమీపంలోనే ఇళ్లు నిర్మించుకుని అక్కడే నివసిస్తున్నారు. మణి గత సంవత్సరం మరణించాడు, చిన్నపొన్ను ఒక్కడే గడ్డి ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఈ స్థితిలో, మంగళవారం ఉదయం ఆమె ఇంటి నుండి దుర్వాసన వస్తోంది. దీని తరువాత, ఆ పరిసరాల్లో నివసించే సామాన్యులు చిన్నపొన్ను ఇంటికి వెళ్లి తనిఖీ చేశారు. ఆ సమయంలో, వృద్ధురాలి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. ఆమె మృతదేహం ట్రంక్‌పెట్టెలో ఉంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, వృద్ధురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఈ విషయంలో పోలీసులు నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తులో నగలు, డబ్బు కోసమే వృద్ధురాలిని హత్య చేసి ఉండవచ్చని తేలింది. మరోవైపు వృద్ధురాలి కుమారుడు సుబ్రమణి, మనవడు రాజప్రియన్ అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. దీంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.


