కొత్త సంవత్సర వేడుకలకు సర్వం సిద్ధం
సాక్షి, చైన్నె: కొత్త సంవత్సరం వేడుకలకు రాష్ట్రంలోని హోటళ్లు, రిసార్టులు, వినోద కేంద్రాలు సిద్ధమయ్యాయి. బుధవారం రాత్రి 7 గంట నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు సంబరాలకు అనుమతి ఇచ్చారు. మహిళలతో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, రోడ్ల మీద శృతి మించినా, హద్దులు దాటినా , దూకుడుగా వాహనాలు నడిపినా కఠిన చర్యలు తప్పదన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. అన్నిమార్గాలో వాహన తనిఖీలకు ఏర్పాట్లు చేశారు. వివరాలు.. 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, 2026ను ఆహ్వానిస్తూ వేడుకలకు రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారు. మరికొన్ని గంటల్లో కొత్త ఏడాదిని సంబరాలతో ఆహ్వానం పలికే దిశగా ఏర్పాట్లు చేసుకున్నారు. హోటళ్లు, రిసార్ట్‌లు, వినోద కేంద్రాలు సిద్ధం అయ్యాయి. సంగీత విభావరీలు, విందుల పసందు, మద్యం హోరు, అందాల స్టార్ల ప్రత్యేక ఆకర్షణలతో దిమ్మతిరిగే ఏర్పాట్లు అనేక హోటళ్లు, రిసార్టు యాజమాన్యాలు చేశాయి. రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంటవరకు మాత్రమే వేడుకలకు అవకాశం ఇచ్చారు. చైన్నెతోపాటూ శివారులలోని తాంబరం, ఆవడి కార్పొరేషన్ల పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
కట్టుదిట్టంగా భద్రత..
కొత్త సంవత్సరం వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, ప్రమాదాలకు ఆస్కారం ఇవ్వని రీతిలో భద్రతను రాష్ట్రంలో కట్టుదిట్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది సిబ్బందిని విధుల్లోకి దించారు. కోయంబత్తూరు, తిరునల్వేలి, తిరుచ్చి, మదురై వంటి ప్రధాన నగరాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. అన్ని చోట్ల రాత్రి తొమ్మిది గంటల నుంచి వాహనాల తనిఖీలపై దృష్టి పెట్టారు. రాత్రి 11 తర్వాత వంతెనలను మూసి వేయడానికి చర్యలు తీసుకున్నారు. చైన్నెలో వేలాది మంది పోలీసులు విధుల్లో దిగనున్నారు. కమిషనర్ అరుణ్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు సైతం రంగంలోకి దిగదాయి. 19 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చైన్నెలోచేశారు. ఏదేని హోటళ్లు నిబంధనలకు విరుద్ధంగా, ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పక్షంలో కొరాడా ఝుళిపించేందకు ఈ బృందాలు సిద్ధమయ్యాయి. చైన్నె నగరంలోని సుమారు 400లకు పైగా ప్రాంతాలలో రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ప్రత్యేక చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేసి, వాహనాల తనిఖీ చేస్తున్నారు. ఆయా మార్గాలలో విద్యుత్ వెలుగుతో కూడిన బారికెడ్లను ఏరా్పాటు చేశారు. ప్రమాద రహిత సంబరాలు జరుపుకోనే విధంగా యువతకు సూచిస్తున్నారు. యువతులు, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించినా అరెస్టు చేసి కట కటాల్లోకి నెట్టాల్సి ఉంటుందన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. వాహనాల్ని అతి వేగంగా నడిపే బైక్ రేసర్ల భరతం పట్టేందుకు మొబైల్ బృందాలను నియమించారు. చైన్నెలోని ప్రధాన వంతెనలను రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు మూసి వేయడానికి చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా బీచ్, ప్రార్థనా స్థలాలు, ఆయా మార్గాలలో అదనపు కమిషనర్ల, జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్ల నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణలో భద్రతా చర్యలు తీసుకున్నారు. బీచ్‌లలో అశ్వదళాలలు, ఇసుకలో దూసుకెళ్లే వాహనాలతో భద్రత చర్యలు తీసుకున్నారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా టాస్మాక్ మద్యం దుకాణాలలో పూటుగా వివిధ బ్రాండ్లను మార్కెటింగ్ శాఖ సిద్ధం చేసింది. చైన్నెలోని మెరీనా, బీసెంట్‌నగర్, ఎలియట్స్, కాశిమేడు, తిరువొత్తియూరు, నీలాంకరై తదితర బీచ్‌ల పరిసరాలలో సంబరాలకు ఏర్పాట్లు జరిగాయి. డ్రోన్ కెమెరాల ద్వారా సైతం భద్రతను పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకున్నారు.
కొత్త సంవత్సర వేడుకలకు సర్వం సిద్ధం
కొత్త సంవత్సర వేడుకలకు సర్వం సిద్ధం


