తమిళనాడు వైపు.. దేశం చూపు
సాక్షి, చైన్నె: తమిళనాడు వైపుగా యావత్ భారత్ చూస్తున్నట్టు డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ప్రగతి పథంలో తమిళనాడు దూసుకెళ్తోందన్నారు. మంగళవారం డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ కోయంబత్తూరులో పర్యటించారు. ఇక్కడ రూ. 9.67 కోట్లతో నిర్మించిన బ్రహ్మాండ హాకీ స్టేడియాన్ని ప్రారంభించారు. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో క్రీడాకారులకు క్రీడా పరికరాలు, లబ్ధిదారులకు వివిధ సంక్షేమ పథకాలను అందజేశారు. అలాగే కోయంబత్తూరు ఫారెస్ట్ రిజర్వ్‌లో రూ. 19.50 కోట్ల వ్యయంతో నిర్మించిన వన్యప్రాణుల చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించారు. సాడివయల్‌లో రూ. 8 కోట్లతో ఏర్పాటు చేసిన ఏనుగుల సంరక్షణశిబిరాన్ని ప్రారంభించారు. రూ. 2.60 కోట్లతో తీర్చిదిద్దిన ఎలక్ట్రానిక్ ఫారెస్ట్ ఆర్‌క్లేవ్, వీడియో కాన్ఫరెన్సింగ్, ఇంటర్నెట్ సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు అటవీ దళ ఆధునీకరణ ప్రాజెక్ట్ లక్ష్యంగా 315 సిబ్బందికి తుపాకులను అందజేశారు.
జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు..
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తమిళనాడుకు ఒక ముఖ్యమైన స్థానంలో ఉందన్నారు. తమిళనాడు జీవవైవిధ్యం, వారసత్వాన్ని కాపాడటానికి వివిధ చర్యలు విస్తృతం చేసిందన్నారు. అంతరించి పోతున్న వన్యప్రాణులు, వివిధ జాతుల పక్షులు తదితర వాటికి పునర్జీవం దిశగా కార్యాచరణ వేగవంతం చేశామన్నారు. వన్యప్రాణులకు చికిత్స చేయడానికి అన్ని రకాల వసతులతో చికిత్స కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రం ద్వారా సేకరించిన పదార్థాలు, వన్యప్రాణులకు అధిక–నాణ్యత సంరక్షణ అందించడం, రక్షించడం దిశగా అనేక సౌకార్యలను కల్పించామన్నారు. రాష్ట్రంలో అటవీ నేరాల నియంత్రణ, వన్యప్రాణుల అక్రమ రవాణా కట్టడి, అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణను మెరుగు పరిచే విధంగా వన్య ప్రాణుల నేర నివారణ విభాగాన్ని తాజాగా ప్రారంభించామని ప్రకటించారు. ఏనుగుల సంరక్షణలో తమిళనాడు ఇతర రాష్ట్రాల కంటే ముందుందన్నారు. ఆర్‌ఎస్‌పురంలో కొత్తగా నిర్మించిన హాకీ మైదానంలోని వసతులను ప్రస్తావిస్తూ, క్రీడా పరంగా సైతం తమిళనాడు ఉరకలు తీస్తున్నదన్నారు. తమిళనాడు వైపుగా యావత్ భారతం చూపు పడిందని, ఆ మేరకు ద్రావిడ మోడల్ సీఎం స్టాలిన్ పాలన ఇక్కడ జరుగుతోందన్నారు. కోయంబత్తూరుపై సీఎంకు ప్రత్యేక అభిమానం ఉందని పేర్కొంటూ, ఓట్లు వేసినా, వేయని వాళ్లకు సైతం సంక్షేమ పథకాలను విస్తృతంగా అందిస్తున్న ద్రావిడ మోడల్ ప్రభుత్వానికి ప్రజలు మరింత అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రి రాజకన్నప్పన్, ఎంపీలు గణపతి పి. రాజ్‌కుమార్, కె. ఈశ్వరస్వామి, శాసనసభ సభ్యుడు, తమిళనాడు పారిశుద్ధ్య కార్మికుల బోర్డు చైర్మన్ వి. సెంథిల్ బాలాజీ, తిప్పంపట్టి ఆరుసామి, పర్యావరణం, వాతావరణ మార్పుల, అటవీ శాఖ కార్యదర్శి సుప్రియా సాహు, కోయంబత్తూరు కలెక్టర్ పవన్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
తమిళనాడు వైపు.. దేశం చూపు


