●పలు కార్యక్రమాలకు ఏర్పాట్లు
●పలు కార్యక్రమాలకు ఏర్పాట్లు
సాక్షి, చైన్నె: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఈనెల 28వ తేదీన కోయంబత్తూరుకు రానున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ వర్గాలు కసరత్తులు చేపట్టాయి. తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ ఇటీవల ఉప రాష్ట్రపతి పదవిని అధిరోహించిన విషయం తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ఇంత వరకు తమిళనాడుకు రాలేదు. గత నెలాఖరులోరావాల్సి ఉండగా, కరూర్ విషాద ఘటన నేపథ్యంలో వాయిదా పడింది. ఈ పరిస్థితులలో ఆయన ఈనెల 28వ తేదీన కోయంబత్తూరుకు రానున్నారు. ఉప రాష్ట్రపతిగా ప్రపథమంగా తమిళనాడుకు వస్తున్న సీపీ రాధాకృష్ణన్‌కు కోయంబత్తూరు విమానాశ్రయంలో బ్రహ్మరథం పట్టేవిధంగా ఆహ్వానం పలికేందుకు బీజేపీ వర్గాలు కసరత్తులు చేపట్టాయి. కోయంబత్తూరులో పారిశ్రామికవేత్తలతో జరిగే సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. కోయంబత్తూరు కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించనున్నారు. కోయంబత్తూరులోఉదయం నుంచిసాయంత్రం వరకు జరిగే కార్యక్రమాల తర్వాత ఆయన తిరుప్పూర్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. కోయంబత్తూరులో ఆయన పర్యటించే ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
వర్షం దెబ్బ..పెరిగిన కూరగాయల ధరలు
కొరుక్కుపేట: తమిళనాడుతో పాటు వివిధ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చైన్నెలో కూడా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కోయంబేడు మార్కెట్‌కు వచ్చే కూరగాయల లోడ్‌లు తక్కువగా రావటంతో కూరగాయలు ధరలు అమాంతంగా పెరిగి పోయాయి. ఇప్పటి వరకు కిలో రూ.20 ఉన్న టమాటా ప్రస్తుతం రూ.60కి పెరిగింది. బీనన్స్ రూ.80, శనగలు రూ.60, క్యారెట్లు–రూ.50 పలికినట్లు తెలిపారు. ఇక బయటి మార్కెట్‌లోని దుకాణాల్లో టమాటాలు కిలో రూ.70 వరకు, బీనన్స్, మునగకాయలు కిలో రూ.120 వరకు అమ్ముడవుతున్నాయని వెల్లడించారు.
బడులకు బెదిరింపులు
సాక్షి,చైన్నె : చైన్నె శివారులోని పలు పాఠశాలలకు గురువారం వచ్చిన బాంబు బెదిరింపుతో పోలీసులు ఉరకలు తీశారు. దీపావళి సెలవుల అనంతరం బుధవారం బడులు తెరచుకోవాల్సి ఉండగా, వర్షం కారణంగా వాయిదా పడింది. వర్షం తెరపించడంతో గురువారం యథాప్రకారం పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఈ పరిస్థితులలో ఉదయాన్నే చైన్నె శివారులోని నొలంబూరు, తిరుమలిసై, పూందమల్లి, పరిసరాలో ఏడు పాఠశాలలకు ఒకటి తర్వాత మరొకటి అంటూవచ్చిన బెదిరింపు కాల్స్‌తో పోలీసులు, బాంబు, డాగ్‌స్క్వాడ్‌లు ఉరకలు తీశాయి. ఆ పరిసరాలలో తీవ్రంగా సోదాలు నిర్వహించినానంతరం ఇది బూచీ అని నిర్ధారించారు. ఇటీవల కాలంగా చైన్నె, శివారులలో బాంబు బెదిరింపు ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే.
28న కోవైకు ఉపరాష్ట్రపతి


