మళ్లీ అధికారం డీఎంకేదే!
వేలూరు: డీఎంకే మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని రాష్ట్ర మంత్రి దురై మురుగన్ అన్నారు. వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని మోర్థానా డ్యామ్ నిర్మించి 25 సంవత్సరాలు పూర్తి కావడంతో అక్కడ శిలాఫలకాన్ని మంత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మోర్థానా డ్యామ్‌లో తమ ప్రభుత్వం మరోసారి వచ్చిన వెంటనే ఇక్కడ ప్రత్యేక పార్కు ఏర్పాటు చేసి పర్యాటకుల అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. డీఎంకే మళ్లీ అధికారానికి వస్తుందని వీటిలో ఎవరికీ ఎటువంటి అనుమానం లేదన్నారు. ఈ డ్యామ్ తన జీవితంలో ఇమిడి ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కామరాజర్ ఈ నియోజక వర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మోర్ధానా డ్యామ్ కట్టేందుకు ప్రయత్నించారన్నారు. అయితే నిధులులేని కారణంగా అంత పెద్ద నాయకుడే సాధ్యం కాలేదన్నారు. అనంతరం తాము అధికారానికి వచ్చిన వెంటనే ఇక్కడి రైతులను ఆదుకునేందుకు ఇంత పెద్ద డ్యామ్‌ను నిర్మించామని తెలిపారు. మోర్థానా నీటి పారుదల కాలువల నుంచి అక్రమంగా నీటిని వినియోగిస్తే పోలీస్ కేసు నమోదు చేస్తామన్నారు. వేలూరు జిల్లాలో ఆసనాంబట్టు, పత్రపల్లి ప్రాంతాల్లో రెండు చోట్ల డ్యామ్‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని వీటిని త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కలెక్టర్ సుబ్బలక్షి, అధికారులు, ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.


