ఏనుగులొచ్చాయ్..చూసొద్దాం రండి
తమిళనాడు జంట ఏనుగులు వనం వీడి నగరబాట పట్టి ప్రజలను హడలెత్తించాయి. ఎప్పుడూ లేనిది చిత్తూరుకు ఏనుగులు రావడంతో కలకలం రేగింది. ఎంచక్కా చెరువులో సేదదీరాయి. జలకాలాటలతో సందడి చేశాయి. దీంతో వాటిని చూసేందుకు పోలోమంటూ జనం చెరువు వద్దకు పరుగులు తీశారు. సెల్‌ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీస్తూ ఎంజాయ్ చేశారు. ఈ ఏనుగులు చిత్తూరు, జీడీనెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల మధ్య హల్‌చల్ చేస్తున్నాయి.
చిత్తూరు కార్పొరేషన్: అటవీ సమీప ప్రాంతాలు, పంట పొలాల్లో దర్శనమిచ్చే ఏనుగులు ఆదివారం చిత్తూరు నగరానికి వచ్చాయి. దంతాలతో ఉన్న రెండు ఏనుగులు సంతపేట దొంగలబావివీధి సమీపంలోని బుడ్డమాను చెరువు వద్దకు వచ్చాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడి చెరువులోనే సేదదీరాయి. ఇది దావానంలా వ్యాపించడంతో జనం పోలోమంటూ చెరువు వద్దకు వచ్చారు. దీంతో పోలీసులు, అటవీశాఖ సిబ్బందిని వారిని కట్టడి చేశారు. మరోవైపు ఏనుగులు దిగిన చెరువులో నీటికి అతి సమీపంలోనే విద్యుత్ తీగలు ఉండడంతో ఏనుగులు వాటి మూలాన ప్రమాదం బారిన పడకుండా ఉండేందుకు ఆ ప్రాంతంలో కరెంటు సరఫరా నిలుపుదల చేశారు. అక్కడ ఓ ఏనుగు ఎఫ్‌బీఓ రెడ్డెప్పపై దాడి చేసేందుకు ప్రయత్నించగా అతను కిందపడి త్రుటిలో తప్పించుకున్నాడు.
తమిళనాడు నుంచి..
తమిళనాడులోని వేలూరు జిల్లాలోని కాట్పాడి నుంచి గుడిపాలలోని బొమ్మసముద్రం, పొన్నై, ఎస్‌ఆర్‌పురం, కార్వేటినగరం, వెదురుకుప్పం, పెనుమూరు, పూతలపట్టు మీదుగా ఈ ఏనుగులు చిత్తూరుకు వచ్చాయని అధికారులు తెలిపారు. చిత్తూరు నుంచి ఏనుగులను స్థానిక కోడిగుంట అటవీ ప్రాంతానికి, ఆ తర్వాత అటు వైపు పలమనేరు అభయారణ్యానికి మళ్లించడానికి సిబ్బంది యత్నిస్తున్నారు. డీఎఫ్‌ఓ సుబ్బరాజు ఎఫ్‌ఆర్వోలు పట్టాభి, థామస్, డీఆర్వో కరణ్‌సింగ్ పర్యవేక్షిస్తున్నారు.
ఏనుగులొచ్చాయ్..చూసొద్దాం రండి


