రేబిస్‌తో కార్మికుడి మృతి | - | Sakshi
Sakshi News home page

రేబిస్‌తో కార్మికుడి మృతి

Sep 25 2025 7:29 AM | Updated on Sep 25 2025 12:43 PM

తిరువొత్తియూరు: కుక్క కరిచి రేబీస్‌ వ్యాధి సోకిన కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వేలూరు జిల్లా, ఒడుగత్తూరు సమీపంలోని కత్తూరు గ్రామానికి చెందిన కరుణానిధి (45)కార్మికుడు. ఇతని భార్య సుధ (40). వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత 8వ తేదీన కరుణానిధి బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా వీధి కుక్క కరిచింది. చికిత్స తీసుకోకపోవడంతో కరుణానిధికి ఆరోగ్యం క్షీణించింది. కుటుంబసభ్యులు అతన్ని అనైకట్టు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి అతనికి రేబిస్‌ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి వేలూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కరుణానిధి మంగళవారం రాత్రి మృతిచెందాడు. వేపంగుప్పం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

లారీ ఢీకొని యువకుడి దుర్మరణం

తిరువళ్లూరు: బైక్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన పట్రపెరంబదూరు సమీపంలో జరిగింది. తిరువళ్లూరు జిల్లా పెద్దమంజాకుప్పం గ్రామానికి చెందిన రామన్‌ కుమారుడు జయపాల్‌(25). ఇతను పట్రపెరందూరులోని టోల్‌ప్లాజాలో పనిచేస్తున్నాడు. ఈక్రమంలో మంగళవారం రాత్రి విధులు ముగించుకుని బైక్‌లో ఇంటికి బయలుదేరాడు. పట్రపెరంబదూరు సమీపంలోని బ్రిడ్జి వద్ద వెళుతుండగా ఎదురుగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జయపాల్‌ను స్థానికులు తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తును చేస్తున్నారు.

యువకుడు దారుణ హత్య

తిరువొత్తియూరు: రోడ్డుపై ట్రాక్టర్‌ నడపడడంపై రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నిందితులు ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కళ్లకురిచ్చి జిల్లా, కల్వరాయన్‌మలై తాలూకా, ఇన్నాడు సమీపం మేల్‌నిలవూరు గ్రామానికి చెందిన సుందరం కుమారుడు ఆండి (27) రైతు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇతని పక్కింట్లో ఉంటున్న అళగేశన్‌ కుమారుడు ప్రభుదేవా. మంగళవారం రాత్రి ఆండి ట్రాక్టర్‌ నడుపుకుంటూ వెళ్తుండగా ప్రభుదేవా ట్రాక్టర్‌ను పక్కకు నడపాలని చెప్పాడు. ఈవిషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ప్రభుదేవా, తండ్రి అళగేశన్‌, తల్లి వైల్లెయమ్మాల్‌ ఆండిని తీవ్రంగా కొట్టారు. ఆ సమయంలో ప్రభుదేవా గొడ్డలి తీసుకొచ్చి ఆండి తలపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆండి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న కరియాలూరు పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

బాలుడు కిడ్నాప్‌..సురక్షితం

వేలూరు: ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడిని గుర్తు తెలి యని వ్యక్తులు కారులో కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. రెండు గంటల తర్వాత బాలుడు ఆచూకీ లభ్యమైంది. సురక్షితంగా పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. వేలూరు జిల్లా గుడియాత్తం కామాక్షి అమ్మన్‌పేటకు చెందిన బాలుడు ఇంటి ముందు ఆడుకుంటుండంగా ఆ సమయంలో గుర్తు తెలియని వ్యకులు బాలుడిని తీసుకెళ్లారు. బాలుడి కేకలు విని తల్లిదండ్రులు వచ్చి చూడగా కిడ్నాపర్లు వెంటనే కారులో తీసుకుని పరారయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అప్రమత్తమై అన్ని పోలీస్‌స్టేషన్‌లకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశారు. రెండు గంటలపాటు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో తిరుపత్తూరు జిల్లా మాదనూరు వద్ద బాలుడిని కిడ్నాపర్లు రోడ్డు పక్కన వదిలి వెళ్లి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. బాలుడిని తీసుకుని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

అన్నదాతల వినూత్న ఆందోళన

తిరువొత్తియూరు: తిరుచ్చి కావేరీ నది ఒడ్డున రైతు సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను నేతృత్వంలో వినూత్న రీతిలో రైతులు ఆందోళన చేశారు. తిరుచ్చి కావేరి నదిలో జాతీయ దక్షిణ భారత నదుల అనుసంధాన రైతు సంఘం అధ్యక్షుడు అయ్యకన్ను నాయకత్వంలో రైతులు బుధవారం ఉదయం ఇసుకలో మెడ వరకు కూరుకుపోయి వినూత్న రీతిలో ఆందోళన చేశారు. లక్షల క్యూబిక్‌ల వరద నీరు కావేరి నది నుంచి వృథాగా సముద్రంలో కలుస్తోందని, కావేరి–అయ్యారు నదుల అనుసంధానం చేయాలని, సహకార బ్యాంకుల్లోని అన్ని రైతు రుణాలను రద్దు చేయాలని, 60 ఏళ్లు పైబడిన రైతులకు నెలకు రూ.5వేలు పెన్షన్‌ ఇవ్వాలని, శ్రీరంగం అళగిరిపురంలోని కొల్లిడం నదిపై తెగిన ఆనకట్టను నిర్మించాలని డిమాండ్‌ చేశారు.

ఆదిశక్తి అలంకరణలో వరాలతల్లి

చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న దసరా మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం అమ్మవారు ఆదిశక్తి పార్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం పట్టుపీతాంబరాలు , పరిమళభరిత పుష్పమాలికలు , విశేషాభరణాలతో పార్వతీదేవిగా అలంకరించి పూజలు నిర్వహించారు. వేదపండితులు గోవర్ధనశర్మ, తదితర అర్చక బృందం అమ్మవారి ఉత్సవమూర్తి ఎదుట ఈఓ ఏకాంబరం, ఉభయదారులతో కలిసి హోమ పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement