– త్వరలో టాస్మాక్ ప్రకటన
కొరుక్కుపేట: తమిళనాడులో లేబుల్స్, బాటిల్ మూతలు, ప్యాకింగ్ కార్టన్లు మొదలైన వాటిపై జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచారు. దీంతో మద్యం రిటైల్ ధర పెంచాలా? వద్దా అని ప్రభుత్వం పరిశీలిస్తోంది. వివరాలు.. తమిళనా డులో 4,829 మద్యం దుకాణాలు పనిచేస్తున్నాయి. టాస్మాక్ దుకాణాలు 43 సాధారణ రకాలు, 49 మీడియం రకాలు, 128 ప్రీమియం రకాల మద్యం, 35 రకాల బీర్, వైన్‌లను విక్రయిస్తాయి. టాస్మాక్ లిక్కర్ స్టోర్ తయారు చేస్తున్నారు. దీంతో పాటూ విదేశీ మద్యం కూడా ఎలైట్ టాస్మాక్ దుకాణాల ద్వారా ప్రత్యేకంగా అమ్ముడవుతోంది.
ఇక రాష్ట్ర ప్రభుత్వం మద్యంపై వ్యాట్ విధిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల మద్యం బాటిళ్ల మూతలు లేబుల్స్ వంటి ప్యాకేజింగ్ వస్తువులపై జీఎస్టీ రేట్లను 12 శాతం నుండి 18 శాతానికి పెంచింది. అదనంగా, దిగుమతి చేసుకున్న సేవలపై 18 శాతం ఎకై ్సజ్ సుంకం ఉంది. దీని కారణంగా ప్రధాన మద్యం తయారీదారులకు ఉత్పత్తి వ్యయం పెరిగింది. ఫలితంగా తయారీదారులు మద్యం బాటిళ్ల ధరలను పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. ఈనేపథ్యంలో మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జోరందుకుంది. అయితే దీనిపై ఓ ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ, జీఎస్టీ వల్ల మద్యం ధరలు పెరగవని చెప్పారు. ఎకై ్సజ్ సుంకాలు మొదలైన వాటిపై ఆధారపడి ఈ పెరుగుదల ఉంటుందని స్పష్టం చేశారు.
నటుడు రవి మోహన్‌కు నోటీసులు
తమిళసినిమా: ప్రముఖ నటుడు రవి మోహన్ ఇంటికి ఓ ప్రైవేట్ బ్యాంక్ నిర్వాహకులు జప్తు నోటీసులు జారీ చేశారు. అదే విధంగా ఈయన భార్యతో మనస్పర్థలు, విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం వంటి విషయాలతో వార్తల్లో ఉంటున్నారు. కాగా బాబీ టచ్ గోల్డ్ యూనివర్సల్ ప్రైవేట్ సంస్థలో రెండు చిత్రాల్లో నటించడానికి రూ. 12 కోట్లు పారితోషికం చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకుని, రూ.5 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నట్లు, అయితే ఆ సంస్థకీ ఒక్క చిత్రం కూడా చేయకపోవడంతో ఆ సంస్థ తీసుకున్న అడ్వాన్స్ తిరిగి చెల్లించక పోవడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా బాబి టచ్ గోల్డ్ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత బాలచందర్ చైన్నె హైకోర్టును ఆశ్రయించడంతో ఆయన సంస్థ చెల్లించిన అడ్వాన్స్‌కు సమానంగా ఆస్తి పత్రాలను కోర్టులో సమర్పించాలని న్యాయస్థానం రవి మోహన్‌కు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ రవి మోహన్ కోర్టు ఆదేశాలను పాటించక పోవడంతో ఆయన ఆస్తులను జప్తు చేసుకోవాల్సిందిగా బాబి టచ్ గోల్డ్ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉంటే నటుడు రవి మోహన్ స్థానిక వీసీఆర్ రోడ్డులో అందమైన భవనాన్ని కొనుగోలు చేశారు. అందుకు గాను ఓప్రైవేట్ బ్యాంకులో రుణం తీసుకుని, దానికి వాయిదాలు చెల్లించకపోవడంతో ఆ బ్యాంకు అధికారులు రవి మోహన్ ఇంటిని జప్తు చేయడానికి సిద్ధం అయ్యారు. అందుకు గానూ రవి మోహన్‌కు జప్తు నోటీసులు అందించగా దాన్ని తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. తాను కోర్టు ద్వారానే నోటీసులు తీసుకుంటానని చెప్పడంతో బ్యాంకు అధికారులు రవి మోహన్ ఇంటికి జప్తు నోటీసులు అంటించారు. ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సీనియర్ ఐఏఎస్ బీలా వెంకటేష్ మృతి
సాక్షి, చైన్నె : సీనియర్ ఐఏఎస్ అధికారిణి బీలా వెంకటేష్(56) అనారోగ్యంతో చైన్నెలోని ఆస్పత్రిలో బుధవారం రాత్రి మరణించారు. ఆమె మరణంతో ఐఏఎస్ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి. కరోనా సమయంలో ఆమె అసమాన సేవలిందించి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆ సమయంలో ఆరోగ్య శాఖ కార్యదర్శిగా ఆమె విస్తృత సేవలు అందించి, అందరి మన్ననలు పొందారు.
అదే సమయంలో యువ అధికారినికి లైంగిక వేదింపులు ఇచ్చిన కేసులో ఆమె భర్త, రిటైర్డ్ డీజీపీ రాజేష్ దాస్ వ్యవహారంలో తీవ్ర మనో వేదనకు లోనయ్యారు. ఆయనకు దూరంగా ఉంటూ వచ్చిన ఆమె తన పేరును కూడా మార్చుకున్నారు. ప్రస్తుతం విద్యుత్‌శాఖ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ వచ్చారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురై ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సలో ఉన్న ఆమె మరణించినట్లు సమాచారం.
881 మంది అధ్యాపకుల నియామకం
సాక్షి, చైన్నె: ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 881 మంది గౌరవ అధ్యాపకులను తాత్కాలికంగా నియమించనున్నామని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖా మంత్రి కోవిచెలియన్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 15 ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల గురించి వివరించారు. కొత్త కళాశాలలకు, ఇదివరకు ఉన్న కళాశాలల్లో ఖాళీల భర్తీ నిమిత్తం 881 మందిని నియమించనున్నామని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు అని సూచించారు.