అన్నానగర్: చైన్నె విమానాశ్రయంలో రూ.1.33 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. చైన్నె మీనంబాక్కం విమానాశ్రయానికి సరైన అనుమతులు లేకుండా వచ్చే కార్గో విమానాలలో పెద్ద సంఖ్యలో విదేశీ సిగరెట్లను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు చైన్నె విమానాశ్రయ ప్రత్యేక నిఘా విభాగం అధికారులకు సోమవారం రాత్రి రహస్య సమాచారం అందింది. దీంతో విమానాశ్రయ కస్టమ్స్ విభాగం అధికారులు విదేశాల నుంచి వచ్చిన పార్శిళ్లు, కంటైనర్లను తనిఖీ చేశారు.
ఆ సమయంలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి చైన్నెకి వచ్చే అనేక కార్గో పార్శిళ్లలో విదేశీ సిగరెట్లను రహస్యంగా అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఆ సిగరెట్లపై సరైన ఆరోగ్య హెచ్చరికలు లేవు. వీటిలో కేంద్ర ప్రభుత్వం నిషేధించిన ఈ–సిగరెట్లు కూడా ఉన్నాయి. కస్టమ్స్ శాఖ నుంచి సరైన అనుమతి పొందకుండానే వాటిని అక్రమంగా అక్రమంగా రవాణా చేస్తున్నట్లు కూడా తేలింది. దీంతో 1,130 ఈ–సిగరెట్లు, 4.30 లక్షల విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి అంతర్జాతీయ విలువ రూ.1.33 కోట్లుగా భావిస్తున్నారు. కాగా ఆ సిగరెట్లను విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న ప్రైవేట్ కంపెనీపై స్పెషల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు కేసు నమోదు చేశారు.
27న నామక్కల్, కరూర్‌లో విజయ్ పర్యటన
సాక్షి, చైన్నె: మీట్ దీ పీపుల్ పేరిట ఇప్పటికే తమిళగ వెట్రి కళగం నేత విజయ్ రెండు విడతల పర్యటన ముగించారు. మూడో విడతగా నామక్కల్ , కరూర్‌లలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు సాగిన విజయ్ పర్యటనలకు అభిమాన సందోహం నుంచి విశేష స్పందన వచ్చిన విషయం తెలిసిందే. డీఎంకేను టార్గెట్ చేసి విజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ రావడం చర్చకు దారి తీసింది. ఈ పరిస్థితులలో ఈనెల 27వ తేదీన నామక్కల్, కరూర్‌లలో పర్యటించేందుకు విజయ్ నిర్ణయించారు. ఉదయం నామక్కల్, సాయంత్రం కరూర్‌లలో పర్యటనలకు సిద్ధమయ్యారు. ఇందు కోసం అనుమతులు, ఏర్పాట్లపై ఆ జిల్లాల తమిళగ వెట్రి కళగం వర్గాలు దృష్టి పెట్టాయి. అక్టోబరు 4న వేలూరు, రాణిపేట, 11నపుదుచ్చేరి, కడలూరులలో పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించారు. ఇదిలా ఉండగా, విజయ్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యల తూటాలను పేల్చడమే కాకుండా, ప్రజా సమస్యలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే దిశగా ముందుకెళ్తున్న నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ తాజాగా మరో వినూత్న నిరసనకు సిద్ధమయ్యారు. ఇది వరకు ఆయన గొర్రెలు, ఆవులతో సమావేశాలు, ఆ తర్వాత చెట్లతో సమావేశాలు నిర్వహించారు. ఈ పరిస్థితులలో 27వ తేదీన ధర్మపురిజిల్లాలోని కొండ కోనల్లోకి వెళ్లి నిరసనకు నిర్ణయించారు.
మరో బెంచ్‌కు దురై మురుగన్ కేసు
సాక్షి, చైన్నె: డీఎంకే ప్రధాన కార్యదర్శి, సీనియర్ మంత్రి దురై మురుగన్‌పై దాఖలైన అక్రమాస్తుల కేసును మరో బెంచ్‌కు మారుస్తూ హైకోర్టు ఆదేశించింది. 2006–2011 కాలంలో ఆదాయానికి మించి ఆస్తులు గడించినట్టుగా దురై మురుగన్‌పై కేసు నమోదైంది. వేలూరు కోర్టులో ఈ పిటిషన్‌పై తొలుత విచారణ జరిగింది. 2019లో ఈ కేసును వేలూరు నుంచి ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ దురై మురున్ హైకోర్టులో పిటిషన్ వేశారు.ఈ కేసులో 2017లో తనను నిర్ధోషిగా విడుదల చేశారని, ఆతదుపరి కేసును చైన్నెకు బదిలీ చేయడాన్ని తన పిటిషన్‌లో వ్యతిరేకించారు. ఈకేసును ప్రత్యేక కోర్టు విచారించేందుకు వీలులేదని సూచించారు. మంగళవారం పిటిషన్ విచారణకు రాగా, మరో బెంచ్‌కు న్యాయమూర్తి సిఫారసు చేశారు.