Sakshi News home page

సరైన పార్టీలోకే వచ్చా: అన్నాడీఎంకేలోకి గౌతమి

Published Thu, Feb 15 2024 1:50 AM

- - Sakshi

సాక్షి, చైన్నె: సినీ నటి గౌతమి బుధవారం అన్నాడీఎంకేలో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళని స్వామి సమక్షంలో సాయంత్రం అన్నాడీఎంకే కండువా కప్పుకున్నారు. గతంలో గౌతమి బీజేపీలో పని చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ నుంచి తనకు తనకు మద్ధతు కరువైందని చెబుతూ ఆమె రాజీనామా చేశారు. ఆ తర్వాత తన రాజకీయ భవిష్యత్తు గురించి ఆమె ఎలాంటి ప్రకటన చేయలేదు. 

ఈ క్రమంలో బుధవారం సాయంత్రం చైన్నెగ్రీన్‌ వేస్‌ రోడ్డులోని పళని స్వామి నివాసానికి వెళ్లారు. ఆయన సమక్షంలో అన్నాడీఎంకేలో చేరారు. ఈ సందర్భంగా గౌతమి మీడియాతో మాట్లాడుతూ..  సరైన పార్టీలోకి తాను వచ్చానని పేర్కొన్నారు. దివంగత సీఎం అమ్మ జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేను సరైన మార్గంలో పళని స్వామి నడిపిస్తున్నారని ఆమె కితాబిచ్చారు.

పాతికేళ్లుగా బీజేపీలో కొనసాగిన గౌతమి తాడిమళ్ల.. కిందటి ఏడాది అక్టోబర్‌లో బీజేపీకి గుడ్‌బై చెప్పారు. ఆ సమయంలో ఆమె సంచలన ఆరోపణలే చేశారు. పార్టీ నుంచి మద్దతు కరువైనందునే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారామె. ఈ మేరకు ఎక్స్‌ అకౌంట్‌లో ఆమె ఆ సమయంలో పెద్ద పోస్ట్‌ ఉంచారు. తన ఆస్తులను స్వాహా చేసిన వ్యక్తికి పార్టీలో  సీనియర్లే మద్దతు ఇచ్చారంటూ ఆమె ఆరోపించారు కూడా. ఇదిలా ఉంటే.. గత వారం బీజేపీ నుంచి బయటకు వచ్చిన నటి గాయత్రి రఘురాం కూడా అన్నాడీఎంకేలో చేరిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement