
ఆ వ్యక్తి ఎవరో పోలీసులు తేల్చాల్సి ఉందన్నారు.
సాక్షి, చైన్నె: కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ కార్యాలయంలోకి గుర్తుతెలియని అగంతకుడు చొరబడ్డాడు. అతన్ని అక్కడున్న సిబ్బంది బలవంతంగా బయటకు గెంటేశారు. అయితే, మంగళవారం ఉదయం ఆ అగంతకుడు మృతదేహంగా తేలాడు. ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. కోయంబత్తూరు, హొసూరు రోడ్డులో బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ కార్యాలయం ఉంది. సోమవారం సాయంత్రం ఆరుగంటల సమయంలో ఆ కార్యాలయంలోకి ఓ అగంతకుడు చొరబడ్డాడు.
లోనికి రాగానే గడియ పెట్టే ప్రయత్నంచేశాడు. దీనిని గుర్తించిన అక్కడి సిబ్బంది విజయ్ అతడిని పట్టుకున్నాడు. బలవంతంగా బయటకు తీసుకొచ్చి రోడ్డులో తోసేశాడు. ఈ అగంతకుడి చొరబాటుపై రేస్‌కోర్సు పోలీసులకు విజయ్ ఫిర్యాదు చేశాడు. ఈ పరిస్థితులలో మంగళవారం ఉదయం అదే అగంతకుడు మృతదేహంగా తేలాడు. అన్నాసాలై సిగ్నల్ వద్ద అతడి మృతదేహం బయట పడింది. గుర్తుతెలియని వాహనం ఏదేని ఢీకొట్టి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఇదే వ్యక్తి వానతీ శ్రీనివాసన్ కార్యాలయంలోకి చొరబడిన దృష్ట్యా విచారణను వేగవంతం చేశారు.
ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ మీడియాతో మాట్లాడుతూ, ఆ వ్యక్తి ఎవరో పోలీసులు తేల్చాల్సి ఉందన్నారు. తన కార్యాలయంలోకి ఎందుకు చొరబడ్డాడో పోలీసులే తేల్చాలన్నారు. అతడు పూర్తిగా మత్తులో ఉన్నట్టు తన సిబ్బంది పేర్కొన్నారని, పోలీసులకు తాము అప్పుడే ఫిర్యాదు కూడా చేశామన్నారు. ఈ అగంతకుడి వివరాలు తెలియక పోలీసులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. అతడి మృతదేహంపై ఉన్న ఆనవాళ్ల ఆధారంగా వివరాలను సేకరిస్తున్నారు.