చైన్నె ఆర్మీ ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో ఘనంగా పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ | Sakshi
Sakshi News home page

చైన్నె ఆర్మీ ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో ఘనంగా పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌

Published Sun, Apr 30 2023 7:50 AM

శిక్షణలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు మెడల్స్‌ అందజేస్తున్న ఉన్నతాధికారులు  - Sakshi

సాక్షి, చైన్నె: భారత సైన్యంలో సేవలందించేందుకు యువత సిద్ధమైంది. ఆర్మీలో సేవలందించే యువ అధికారులు చైన్నెలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే. చైన్నె సెయింట్‌ థామస్‌ మౌంట్‌లోని ఆర్మీ ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ నుంచి ఏటా ఓ బృందం శిక్షణ ముగించుకుని సరిహద్దులకు బయలుదేరుతోంది. శనివారం పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ ముగించుకున్న యువ అధికారులు దేశసేవకు అంకితమయ్యారు.

పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌తో..
అకాడమీలో కఠిన శిక్షణ పొందిన ఆఫీసర్స్‌ స్థాయి అధికారులు తమ ప్రతిభా పాటవాలను చాటుకునే రీతిలో విన్యాసాలు ప్రదర్శించారు. అందరినీ అబ్బుర పరిచే విధంగా ఈ విన్యాసాలు సాగాయి. చివరిలో సర్టిఫికెట్లను అందుకుని దేశ సేవకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది 121 మంది యువ అధికారులు, 36 మంది మహిళా అధికారులు పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో పాల్గొన్నారు. ఇందులో తొలిసారిగా ఐదుగురు మహిళా కేడెట్‌లు ఆర్టిలర్‌ రెజిమెంట్‌లోకి ప్రవేశించారు. అలాగే భూటాన్‌కు చెందిన ఐదుగురు, 24 మంది మహిళ క్యాడెట్లు తమ శిక్షణను పూర్తి చేశారు.

వివిధ ఆయుధాలను చాకచక్యంగా ఉపయోగించే నేర్పును ప్రదర్శించారు. ఏడాది పాటు శిక్షణలో ఆరి తేరిన వీరంతా యువ అధికారుల హోదాతో భారత సైన్యంలో చేరారు. అకాడమీలోని పరమేశ్వరన్‌ డ్రిల్‌ స్క్వయర్‌లో శనివారం ఉదయం జరిగిన పరేడ్‌తో దేశ సేవకు తమను అంకితం చేసుకున్నారు. బంగ్లాదేశ్‌ ఆర్మీ చీఫ్‌ ఎస్‌ఎం షఫీయుద్దీన్‌ అహ్మద్‌ ఈ పరేడ్‌ను సమీక్షించారు. ఏసీఏ అజయ్‌ సింగ్‌ గిల్‌ స్క్వాడ్‌ ఆఫ్‌ హానర్‌తో పాటు ఓటీఏ బంగారు పతకం అందుకున్నారు. అలాగే రజత పతకాన్ని ఎస్‌యూఓ అజయ్‌కుమార్‌, కాంస్య పతకాన్ని బీయూఓ మెహక్‌ సైనీ దక్కించకున్నారు. దేశానికి నిస్వార్థ సేవలందిస్తామని , సైనిక విలువలకు కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా యువ అధికారులు ప్రమాణం చేశారు.

అనంతరం జరిగిన కార్యక్రమంలో యువ అధికారులకు నియామక ఉత్తర్వులు అందజేశారు. ‘స్టార్స్‌’ గుర్తింపుతో ఈ వేడుక సాగింది. స్టార్స్‌ గుర్తింపు సమయంలో సహచర కేడెట్లతో కలిసి యువ అధికారులు ఆనందాన్ని పంచుకున్నారు.

గౌరవ వందనం స్వీకరిస్తూ..
భారత మాత సేవకు యువకిశోరాలు సిద్ధమయ్యారు. శిక్షణను విజయవంతంగా ముగించుకుని విధి నిర్వహణలో భాగంగా సరిహద్దులకు పయానమయ్యారు. దేశభక్తి చాటే విధంగా శనివారం నిర్వహించిన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో యువ ఆర్మీ అధికారులు అద్భుత ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు.

1/2

పరేడ్‌ నిర్వహిస్తూ
2/2

పరేడ్‌ నిర్వహిస్తూ

Advertisement

తప్పక చదవండి

Advertisement