లేబర్‌ ఆఫీసులో ఏజెంట్ల రాజ్యం | - | Sakshi
Sakshi News home page

లేబర్‌ ఆఫీసులో ఏజెంట్ల రాజ్యం

Nov 16 2026 2:44 AM | Updated on Nov 16 2026 2:44 AM

ఉన్నతాధికారులు విచారణ జరపాలి

కోదాడ : కష్టజీవులు, నిరక్షరాస్యులైన కార్మికులకు అండగా ఉండాల్సిన కోదాడలోని లేబర్‌ ఆఫీస్‌(ఏఎల్‌ఓ) ఏజెంట్ల అడ్డాగా మారింది. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వారికి చేరువ చేయాల్సిన వారే ప్రైవేట్‌ ఏజెంట్లను నియమించుకొని అక్రమ దందాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారం చెల్లింపులోనూ వాటాలు అడుగుతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. లేకపోతే తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెండు నియోజకవర్గాలకు

ఒక్కటే కార్యాలయం..

కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాలకు కలిపి కోదాడలో అసిస్టెంట్‌ లేబర్‌ కార్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం 13 మండలాలకు చెందిన 10వేల మంది కార్మికులు ఈ కార్యాలయ పరిధిలోకి వస్తారు. ఈ కార్యాలయం ఎక్కడ ఉందో గూగుల్‌ కూడా కనుగొనలేని ప్రదేశంలో ఏర్పాటు చేశారు. కార్యాలయ భవనం కూడా సరిగా లేదని కార్మికులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఏఎల్‌ఓ లేక పోవడంతో సూర్యాపేట అధికారికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. పూర్తిస్థాయి అధికారి లేక పోవడంతో కార్యాలయంలోని సీనియర్‌ అధికారి ఒకరు అన్నీ తానై చక్రం తిప్పుతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. గత సంవత్సరం కార్యాలయంపై ఏసీబీ దాడులు జరిగినా పనిలో మాత్రం మార్పురాలేదని కార్మికులు అంటున్నారు.

మండలానికో ఏజెంట్‌

లేబర్‌ కార్యాలయంలో పని జరగాలంటే నేరుగా అధికారులను కలిసే పరిస్థితి లేదని, కార్యాలయం వారే మండలానికి ఒక ఏజెంట్‌ను ఏర్పాటు చేసుకొని వారి ద్వారానే పనులు చక్క బెడుతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఏజెంట్లను కాదని నేరుగా కార్యాలయానికి వెళితే కొర్రీలు పెట్టి చెప్పులు అరిగేలా తిరగాల్సి వస్తుందని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. లేబర్‌ కార్డులు తీసుకునేందుకు, రెన్యూవల్‌, వివాహ కానుక, ప్రసూతి సాయం, ప్రమాద బీమా, మరణాంతర పరిహారం వంటి ప్రతి పనికి ఏజెంట్లు ఒక ప్రత్యక రేట్‌ ఫిక్స్‌ చేసి వసూళ్ల దందా నడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుడు ప్రమాదంలో మరణిస్తే ప్రభుత్వం ఇచ్చే రూ. 6 లక్షల పరిహారానికి సగం వాటా ఇవ్వాలని ఏజెంట్లు చెబుతున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

పూర్తిస్థాయి ఏఎల్‌ఓ లేక

సీనియర్‌ ఉద్యోగిదే రాజ్యం

మండలానికో ఏజెంట్‌ను పెట్టుకుని అక్రమ దందా

కార్మికులకు సంక్షేమ పథకాల

అందజేతకూ వాటాలు

కోదాడ అసిస్టెంట్‌ లేబర్‌ కార్యాలయం అవినీతి మయంగా మారింది. ఇన్‌చార్జి ఏఎల్‌ఓ రాకపోవడంతో ఇక్కడి సీనియర్‌ ఉద్యోగి ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వసూళ్లుకు పాల్పడుతున్నాడు. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో రెండు రోజుల క్రితం కార్యాలయం ఎదుట కార్మికులతో కలిసి ధర్నా చేశాం. ఉన్నతాధికారులు కార్యాలయంలో అవినీతిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.

– మేకల శ్రీనివాసరావు,

కార్మికసంఘం నాయకుడు, కోదాడ

నిబంధనల పేరుతో వేధింపులు..

వివిధ పనుల నిమిత్తం నేరుగా లేబర్‌ కార్యాలయానికి వెళితే నిబంధనల పేరుతో కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. లేబర్‌ కార్డు కావాలంటే మీ సేవా కార్యాలంలో రూ.130 చెల్లించి ఆ పత్రాలను కార్యాలయంలో ఇస్తే వారు ఆమోదించి కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కంప్యూటర్‌ లాగిన్‌ కావడం లేదంటూ తిప్పుతున్నారని, ఏజెంట్‌కు రూ.1500 ఇస్తే అదే రోజు కార్డు వస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోదాడ కార్యాలయంలోని ఓ అధికారి ఏకంగా హుజూర్‌నగర్‌లో ప్రైవేట్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని దందాను కొనసాగిస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి లేబర్‌ కార్యాలయంలో పరిస్థితిని చక్కదిద్ది తమకు న్యాయం చేయాలని కార్మికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement