హుజూర్నగర్ : ప్రాథమిక పాఠశాలలకు మరణ శాసనంగా మారిన జీఓ నంబర్ 25ను వెంటనే రద్దు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా మహాసభల్లో భాగంగా ఆదివారం హుజూర్నగర్లో నిర్వహించిన ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన పీఆర్సీని తక్షణమే జూలై 2023 నుంచి అమలు చేయాలని, విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలల మూసివేత, విలీనం, ఏకోపాధ్యాయ పాఠశాలల ఏర్పాటును నిలిపి వేయాలని కోరారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలన్నారు. ప్రతినిధుల సభలో జిల్లా లోని 25 మండల శాఖలు పాల్గొని ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కోసం, విద్యార్థుల సంఖ్య పెంచేందుకు, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు, సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని, ఉపాధ్యాయుల ఆర్థిక, సర్వీస్ సంబంధిత సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యారంగానికి కేటాయింపులు పెంచాలని, విద్యాశాఖ పరిధిలో ఉపాధ్యాయుల, అధికారుల పోస్టులు భర్తీ చేయాలని తీర్మానాలను ఆమోదించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్. సోమయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ పూర్వ అధ్యక్షుడు సీహెచ్. రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్ కుమార్, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు జె. యాకయ్య, జి. వెంకటయ్య, ఆర్. దామోదర్, ఎన్. నాగేశ్వరరావు, జె. కమల, వి. రమేష్, బి. ఆడం, సీహెచ్. రమేష్, డి. లాలు, కె. పాండురంగా చారి, కె. జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి


