భానుపురి (సూర్యాపేట) : బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 16న కలెక్టరేట్‌లో బాలల ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోని సాధారణ ప్రజావాణి ప్రాంగణంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పిల్లల కోసం ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. బాలల హక్కులపై సమాజంలో అవగాహన పెంపొందించడంతో పాటు పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యమన్నారు. వైద్య సదుపాయాలు, పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యా సమస్యలు, గ్రామాలు, కాలనీల్లో పిల్లలకు అవసరమైన సదుపాయాలు, పాఠశాలలకు రవాణా సౌకర్యం వంటి అంశాలపై ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు వివరించారు. జిల్లా ప్రజలు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పిల్లల ప్రజావాణిని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
రెడ్ క్రాస్ ఎగ్జిక్యూటివ్
సభ్యుడిగా శ్యాంప్రసాద్
సూర్యాపేట : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా జిల్లా కేంద్రానికి చెందిన తోట శ్యాంప్రసాద్ ఎన్నికయ్యారు. ఈ మేరకు శనివారం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు శివప్రసాద్ శుక్లా తోట శ్యాంప్రసాద్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ ఇరిగి కోటేశ్వరి, వైస్ చైర్మన్ బండారు రాజా, ట్రెజరర్ పెద్దిరెడ్డి గణేష్, సుధాబ్యాంక్ చైర్మన్ మీలా మహదేవ్, జె.శశిధర్, సవరాల సత్యనారాయణ, డాక్టర్ నిర్మల్ అభినందించారు.
ఎస్‌ఐ, కానిస్టేబుల్
అభ్యర్థులకు మాక్ టెస్ట్
సూర్యాపేటటౌన్ : ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు జిల్లా యంత్రాంగం, పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మాక్ టెస్ట్‌నిర్వహించారు. సూర్యాపేట, కోదాడ పట్టణాల్లో 400 మంది అభ్యర్థులకు అందిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమంలో భాగంగా దీనిని నిర్వహించారు. పరీక్షను హైదరాబాద్‌కు చెందిన ఐరైజ్ ఇన్‌న్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సూర్యాపేట పట్టణంలోని చుక్కా రామయ్య స్పేస్ పాఠశాలలో పరీక్ష నిర్వహణ తీరును ఎస్పీ కె.నరసింహ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో పరీక్షల పట్ల ఉన్న భయాన్ని తొలగించి, వాస్తవ పరీక్షలను సులభంగా, ఆత్మవిశ్వాసంతో రాసేలా చేసేందుకే మాక్ టెస్ట్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ పరీక్షలను సీరియస్‌గా తీసుకొని, సమయపాలన పాటిస్తూ ప్రశ్నలకు నిర్ణీత సమయంలో సమాధానాలు రాయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఎస్పీ వెంట పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, వెల్ఫేర్ ఆర్‌ఎస్‌ఐ సాయిరాం, ఎస్‌ఐలు రాఘవేందర్‌రెడ్డి, గోపికృష్ణ, పోలీస్ సిబ్బంది ఉన్నారు.


