భానుపురి (సూర్యాపేట) : ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. దాంతో కూలీలకు పని దొరక్క వలసలు వెళ్లే పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనిని నివారించి కూలీలకు స్థానికంగానే ఉపాధి కల్పించడంతో పాటు వర్షాభావ పరిస్థితులను తట్టుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీబీ జీరాంజీకి పథకం కింద పనులకు ప్రాధాన్యత కల్పిస్తున్నాయి. గతంలో ఉన్న వాటికి అదనంగా పనులను కల్పించనున్నారు. తద్వారా కూలీలకు ఉపాధితో పాటు కరువు పరిస్థితులను ఎదుర్కొనేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
నీటి వనరుల సంరక్షణకే ప్రాధాన్యం
భూగర్భ జలాల పునరుజ్జీవనం, నీటి వనరులను సంరక్షించడం, నీటి లభ్యతను మెరుగుపర్చడమే లక్ష్యంగా జలసిరి పనులను చేపడుతున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు రైతులకు అనుగుణంగా మారడానికి, వ్యవసాయ కార్యకలాపాలను వైవిధ్యపరచడానికి, పశువులకు పచ్చి మేత లభ్యతను పెంచేందుకు, ఉద్యానవన తోటలు, కూరగాయల పందిళ్ల పనులు, పశుగ్రాసం సాగు వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దాంతో పాటు పచ్చదనాన్ని పెంచడానికి, పర్యావరణ సమతుల్యతకు మొక్కల పెంపకం వంటి పనులు కూడా చేపట్టనున్నారు.
మార్చి 2027 వరకు..
2026–27 సంవత్సరానికి కూలీలకు ఉపాధి కల్పించడానికి 60.22 లక్షల పనిదినాల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. వీటి ద్వారా జిల్లాలో పని కావాలన్న ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించనున్నారు. జిల్లాలో 1.70 లక్షల క్రియాశీల జాబ్ కార్డులు ఉండగా.. ఒక్కో కార్డుకు 125 పనిదినాల చొప్పున ఉపాధి కల్పించాల్సి ఉంది. అయితే కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రతి క్రియాశీల జాబ్ కార్డుకు 250 పనిదినాల చొప్పున కల్పించాలని అధికారులు నిర్ణయించారు. అందుకు గానూ 425 లక్షల పనిదినాల కోసం అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం 186 లక్షల పనిదినాలు అందుబాటులో ఉండగా.. మరో 56 లక్షల పనిదినాలకు ఇప్పటికే అంచనాలు రూపొందించారు. మిగిలిన పనిదినాల కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.
ఎల్‌నినో నేపథ్యంలో వీబీ జీరాంజీ
పథకం పనులకు ప్రాధాన్యం
ఇప్పటికే అందుబాటులో 186
లక్షల పనిదినాలు
మరో 425 లక్షల పనిదినాలకు ప్రణాళిక రూపొందిస్తున్న అధికారులు


