చిలుకూరు: రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం చిలుకూరులో రైతుల ధాన్యం రాశులను పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల క్రితం వరకు క్వింటా ధాన్యం రూ.4300 ఉండగా.. ప్రస్తుతం రూ. 1000 తగ్గించి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని, వారికి ప్రభుత్వం కొమ్ముకాస్తుందని విమర్శించారు. వానాకాలం సీజన్లో రైతులను ప్రభుత్వం ఆనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసిందని, సక్రమంగా నీళ్లు, కరెంట్ ఇవ్వలేదని అన్నారు. అయినా అష్టకష్టాలు పడి రైతులు పంటలు పండిస్తే వడ్లకు సరైన ధర రాక తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో కరువు పరిస్థితులు ఏర్పడగా.. ప్రభుత్వం కేవలం కరువు మండలాలను ప్రకటించి చేతులు దులుపుకుందన్నారు. నేటి వరకు రైతులకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అక్కినపల్లి జానకిరామాచారి, ఉపసర్పంచ్ బెల్లంకొండ నాగయ్య, ప్యాక్స్ చైర్మన్ జనార్దన్, మాజీ ఎంపీపీ అన్నపూర్ణ, నాయకులు, రైతులు ఉన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్


