అద్దె ఆదాయానికి గండి! | - | Sakshi
Sakshi News home page

అద్దె ఆదాయానికి గండి!

Nov 20 2026 2:30 AM | Updated on Nov 20 2026 2:30 AM

పూర్తిస్థాయిలో వసూలు చేస్తాం

సూర్యాపేటటౌన్‌ : సూర్యాపేట పట్టణంలోని మున్సిపల్‌ షాపుల ద్వారా రావాల్సిన అద్దెలు ఆశించిన స్థాయిలో వసూలు కావడం లేదు. ఒకవైపు కొందరు వ్యాపారులు అద్దెలు చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. దీంతో మున్సిపాలిటీ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ప్రస్తుతం మున్సిపల్‌ షాపులకు సంబంధించి సుమారు రూ.24 లక్షల అద్దె బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.

పలు ప్రాంతాల్లో 84 షాపులు

పట్టణంలోని పాత బస్టాండ్‌, కూరగాయల మార్కెట్‌, అలంకార్‌ థియేటర్‌, వాణిజ్య భవన్‌ తదితర ప్రాంతాల్లో మున్సిపాలిటీకి చెందిన

మొత్తం 84 అద్దె షాపులు ఉన్నాయి. వీటిలో ఒక్కో షాపునకు నెలకు సుమారు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు అద్దె రావాల్సి ఉంది.

అయితే మొత్తం షాపుల్లో 24 ఖాళీగా ఉండటం గమనార్హం. ఖాళీగా ఉన్న షాపులను తిరిగి అద్దెకు ఇచ్చి ఆదాయం సమకూర్చుకోవడంలో అధికారులు చొరవ చూపడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ షాపులు ఖాళీగా ఉండటంతో మున్సిపాలిటీ నెలకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయాన్ని కోల్పోతోంది. ఏడాది లెక్కన చూస్తే ఈ నష్టం భారీగా ఉంటోంది.

ఆదాయ వనరులున్నా..

మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు నిధుల కొరత ఎదురవుతున్న నేపథ్యంలో సొంత ఆదాయ వనరులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఖాళీగా ఉన్న 24 షాపులను అద్దెకు ఇవ్వడంతోపాటు, పెండింగ్‌లో ఉన్న రూ.24 లక్షల బకాయిలను వసూలు చేస్తే మున్సిపాలిటీకి గణనీయమైన ఆదాయం సమకూరుతుంది. అయినప్పటికీ అధికారులు ఈ అంశంపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఖాళీ షాపులను వినియోగంలోకి తీసుకురావడంతోపాటు అద్దె బకాయిల వసూలుకు పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

మున్సిపల్‌ షాపులు

మొత్తం 84

అద్దెకు ఇచ్చినవి 60

ఖాళీగా ఉంటున్నవి 24

ఏళ్ల తరబడిగా పెండింగ్‌లోనే..

షాపుల్లో అద్దెకు ఉంటున్న కొందరు అద్దెదారులు ఏళ్ల తరబడిగా కిరాయి చెల్లించడం లేదు. దీంతో మున్సిపల్‌ బకాయిలు రూ.24 లక్షలు పేరుకుపోయాయి. బకాయిల వసూలుకు నోటీసులు జారీ చేయడం, నిరంతర పర్యవేక్షణ చేపట్టడం, అవసరమైతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అద్దెల రూపంలో రావాల్సిన ఆదాయాన్ని సకాలంలో రాబట్టలేకపోవడం మున్సిపాలిటీ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతోంది.

‘పేట’లో మున్సిపల్‌ షాపులకు కిరాయి చెల్లించని వ్యాపారులు

రూ.24 లక్షల వరకు

పేరుకుపోయి బకాయిలు

ఖాళీగా ఉంటున్న మరికొన్ని షాపులు

నెలకు కోల్పోతున్న ఆదాయం

రూ.లక్ష నుంచి రూ.2లక్షలు

గతంలో సుమారు రూ.60 లక్షల వరకు ఉన్న బకాయిలను నిరంతర వసూళ్లు, ప్రత్యేక కార్యాచరణ ద్వారా ప్రస్తుతం రూ.24 లక్షలకు తగ్గించాం. మిగిలిన బకాయిలను కూడా పూర్తిస్థాయిలో వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఖాళీగా ఉన్న షాపులను అద్దెకు తీసుకోవాలనుకునే వ్యాపారులు కార్యాలయంలో సంప్రదించాలి

– సీహెచ్‌.హన్మంతరెడ్డి,

మున్సిపల్‌ కమిషనర్‌, సూర్యాపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement