ముఖం చూపిస్తేనే హాజరు | - | Sakshi
Sakshi News home page

ముఖం చూపిస్తేనే హాజరు

Sep 26 2026 1:38 AM | Updated on Sep 26 2026 1:38 AM

పారదర్శకంగా అమలు చేస్తాం

పక్కాగా పర్యవేక్షణ

హాజరు నమోదులో జాప్యం, ఒకరి బదులు మరొకరు హాజరు వేయడం (ప్రాక్సీ) వంటి అక్రమాలకు చెక్‌ పెట్టేందుకే ముఖ గుర్తింపు విధానాన్ని తీసుకొస్తున్నారు. దీనివల్ల సిబ్బంది సమయానికి విధులకు వస్తున్నారా? లేదా? అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. ఈ విధానం వల్ల విద్యార్థుల హాజరు శాతం పెరిగి, పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని విద్యా నిపుణులు చెబుతున్నారు.

సూర్యాపేట టౌన్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సమయపాలన, హాజరు విషయంలో మరింత కచ్చితత్వం తీసుకురావడంపై ఇంటర్మీడియట్‌ బోర్డు దృష్టి సారించింది. ఇందులో భాగంగా అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల హాజరును ముఖ గుర్తింపు ఆధారంగా నమోదు చేసే ‘ఎఫ్‌ఆర్‌ఎస్‌’ (ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌)ను అమల్లోకి తెచ్చింది. గత విద్యా సంవత్సరంలో బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేసినప్పటికీ సాంకేతిక కారణాలతో అది ఆశించిన స్థాయిలో కొనసాగలేదు. దాంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొత్త సాఫ్ట్‌వేర్‌తో ముఖ గుర్తింపు హాజరు విధానానికి శ్రీకారం చుట్టింది.

రోజుకు రెండుసార్లు..

ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యేక యాప్‌ టీజీ బీఐ (తెలంగాణ బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌) ద్వారా హాజరును నమోదు చేయనున్నారు. కళాశాలల్లో విధులు నిర్వహించే అధ్యాపకులు, సిబ్బంది రోజుకు రెండు సార్లు(ఉదయం 9.30 గంటలలోపు, సాయంత్రం 4 గంటలకు) ముఖ గుర్తింపుతో హాజరు వేయాల్సి ఉంటుంది. విద్యార్థుల హాజరును కూడా ఇదే విధానంలో నమోదు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొబైల్‌లో కొత్త యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే విధానం, దాని వినియోగంపై ఇప్పటికే అధ్యాపకులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. జిల్లాలోని కళాశాలల్లో మూడు రోజులుగా ట్రయల్‌ రన్‌ కొనసాగుతుండగా, సోమవారం నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది.

జిల్లాలో 8 ప్రభుత్వ కళాశాలలు..

సూర్యాపేట జిల్లాలో 8 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి సుమారు 3,088 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరితో పాటు 211 మంది అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు. ఇప్పటికే 200 మంది సిబ్బంది రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి కాగా, ప్రస్తుతం విద్యార్థుల వివరాల నమోదు కొనసాగుతోంది.

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో

‘ఎఫ్‌ఆర్‌ఎస్‌’ విధానం

ఫ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులకు పూర్తిస్థాయిలో వర్తింపు

ఫ ‘టీజీబీఐఈ’ యాప్‌ ద్వారా రోజుకు రెండుసార్లు నమోదు

ఫ జిల్లాలో 8 కళాశాలలు, 3,088 మంది విద్యార్థులు

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల హాజరును మరింత పారదర్శకంగా నమోదు చేయడంతో పాటు సమయపాలన పాటించేలా చేయడమే ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానం ప్రధాన ఉద్దేశం. టీజీబీఐఈ యాప్‌ ద్వారా ముఖ గుర్తింపు ఆధారంగా హాజరు నమోదు చేస్తాం. సోమవారం నుంచి ఈ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుంది. దీనివల్ల కళాశాలల పనితీరును మరింత సమర్థంగా పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.

– సులోచనరాణి,

డీఐఈఓ, సూర్యాపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement