సూర్యాపేట : ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి కోరారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర సహాయ ఇన్‌చార్జి భవ్యతో కలిసి పాల్గొని మాట్లాడారు. ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం నుంచి పోలింగ్ వరకు యువజన కార్యకర్తలు అప్రమత్తంగా ఉంటూ, అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు చేయించాలన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు బీఆర్‌ఎస్ పార్టీ అడ్డగోలు హామీలతో పట్టభద్రులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని, పట్టభద్రులు గత పాలనను దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీకి తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకుని పని చేయాలని పిలుపునిచ్చారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం రాష్ట్ర సహాయ ఇన్‌చార్జి భవ్య, లీగల్ సెల్ చైర్మన్ గూడూరు నిఖిల్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి వెలిమినేటి సురేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొమ్ము జోహర్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రావ్య రెడ్డి, కందుకూరి అంబేద్కర్, నియోజకవర్గాల అధ్యక్షులు పాల్గొన్నారు.
ఫ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు
శివచరణ్‌రెడ్డి


