వర్షపాతం ఇలా..
సూర్యాపేట : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. దాదాపు అన్ని మండలాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వానల్లేక ఎండిపోతున్న చెరువులు, కుంటల్లోకి క్రమంగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ సీజన్ ఆరంభం నుంచి సరైన వర్షపాతం లేక కరువు మేఘాలు అలుముకున్న వేళ, ప్రస్తుతం కురుస్తున్న ముసురు వర్షాలు ఆపద్బాంధవుడిలా మారాయని రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తోంది.
ప్రాణం పోసుకుంటున్న జలాశయాలు
జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో తీవ్ర లోటు వర్షపాతం నమోదు కావడంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరక ఎడారిని తలపించాయి. పది రోజుల క్రితం పడిన వర్షాలకు తుంగతుర్తి, తిరుమలగిరి ప్రాంతాల్లోని చెరువులు కాస్త మోస్తరు వరదతో ఊపిరి పీల్చుకున్నాయి. మరోవైపు కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల పరిధిలోని సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంతో ఆయా ప్రాంతాలలోని చెరువుల్లోకి కొంత నీరు చేరింది. అయితే, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లోని మెజారిటీ ప్రాంతాల్లో వర్షాల్లేక జలాశయాలు పూర్తిగా వట్టిపోయాయి. తాజాగా బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని గ్రామాల్లో చెరువులకు మళ్లీ పూర్వవైభవం వస్తోంది. అనేక చోట్ల చెరువుల్లోకి భారీగా నీరు చేరుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో అలుగులు పోస్తున్నాయి. వర్షాలు ఇలాగే మరో రెండు రోజుల పాటు కొనసాగితే జిల్లాలోని మెజారిటీ చెరువులు, కుంటలు నిండి మత్తడి దుముకుతాయని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉండడంతో యాసంగి పంటలకు సాగునీటి కొరత తీరుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నూతనకల్‌లో అత్యధికం.. గరిడేపల్లిలో అత్యల్పం
గడిచిన 24 గంటల్లో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సగటున 69.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోనే అత్యధికంగా నూతనకల్ మండలంలో 102.9 మి.మీ వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా గరిడేపల్లి మండలంలో 29.9 మి.మీ వర్షపాతం నమోదైంది.
నాగారం మండలంలో 58.2 మిల్లీమీటర్ల వర్షపాతం, తిరుమలగిరిలో 67.1, తుంగతుర్తిలో 76.4, మద్దిరాల 83.1 జాజిరెడ్డిగూడెం మండలంలో 64.9, సూర్యాపేటలో 67.2, ఆత్మకూరు ఎస్ లో 96.0, మోతెలో 83.1, చివ్వెంల మండలంలో 60.70, పెన్ పహాడ్ 43.0, మునగాలలో 89.5, నడిగూడెంలో 79.1, అనంతగిరిలో 47.7, కోదాడలో 84.6, చిలుకూరులో 66.8, గరిడేపల్లిలో 29.9, నేరేడుచర్లలో 64.7, పాలకవీడులో 60.7, మట్టంపల్లిలో 63.4 హుజూర్‌నగర్‌లో 86.0, మేళ్లచెరువులో 65.8, చింతలపాలెంలో 52.1 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది.
చెరువులు, కుంటల్లోకి చేరుతున్న వరద నీరు
ఫ హర్షం వ్యక్తం చేస్తున్న
జిల్లా రైతాంగం
ఫ జిల్లాలో సగటున
69.3 మి.మీ వర్షపాతం నమోదు


