రాకపోకలకు ఇబ్బందిగా మారింది
తిరుమలగిరి (తుంగతుర్తి): ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’అనే చందంగా తయారైంది తిరుమలగిరి మున్సిపాలిటీ పరిస్థితి. కొందరు అధికారులు, కింది స్థాయి సిబ్బంది కాసుల కక్కుర్తికి కళ్లెం లేకపోవడంతో పట్టణంలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. క్రాస్ రోడ్డు నుంచి సూర్యాపేటకు వెళ్లే దారిలో భవన యజమానులు తమ ఇష్టారాజ్యంగా రోడ్లను, డ్రెయిన్లను ఆక్రమించేస్తున్నారు. నిబంధనల ప్రకారం అనుమతులు ఒకలా తీసుకుని, నిర్మాణాలు మాత్రం మరొకలా చేపడుతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రోడ్డు పై మోకాళ్ల లోతు నీళ్లు
సూర్యాపేట రహదారి వైపు ఉన్న భవనాల యజమానులు ఆర్‌అండ్‌బీ డ్రెయిన్‌ను సైతం వదలకుండా ఆక్రమించి కట్టడాలు చేపట్టారు. మురుగు కాలువలపై పూర్తిగా సిమెంట్ స్లాబ్‌లు వేయడంతో వర్షపు నీరు కాలువల్లోకి వెళ్లే మార్గం లేక రోడ్డుపైనే నిలిచిపోతోంది. కొద్దిపాటి వర్షం కురిసినా రహదారి చెరువును తలపిస్తోంది. మోకాళ్ల లోతు వరకు నీళ్లు నిలవడంతో బాటసారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నాలాలను సైతం ఆక్రమించడంతో వరద నీరంతా రోడ్లపైకి చేరుతోంది. వర్షం తగ్గాక రహదారిపై బురద పేరుకుపోయి వాహనాలు జారిపడుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.
డ్రెయినేజీ పైపుల మూసివేత..
క్రాస్ రోడ్డు నుంచి సూర్యాపేట వెళ్లే మార్గంలో రోడ్డుకు ఎడమ వైపు నుంచి వచ్చే వరద నీరు కుడి వైపునకు వెళ్లేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు గతంలో రహదారి మధ్యలో పెద్ద పైపులను ఏర్పాటు చేశారు. అయితే, స్థానికంగా చేపట్టిన అక్రమ నిర్మాణాల కారణంగా ఈ రెండు పైపులను పూర్తిగా మూసివేశారు. దీంతో వరద నీరు మళ్లడానికి దారి లేక రోడ్డుపైనే మురుగునీరు నిలిచిపోతోంది. గతంలో ఈ ఆక్రమణలపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఫ తిరుమలగిరిలో కొద్దిపాటి వర్షానికే జలమయమవుతున్న రహదారి
ఫ మోకాళ్ల లోతు నీటిలో
వాహనదారులు, ప్రజల అవస్థలు
ఫ పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు
తిరుమలగిరి క్రాస్ రోడ్డు నుంచి సూర్యాపేట వెళ్లే మార్గంలో వర్షం పడితే చాలు రాకపోకలు సాగించడం ఇబ్బందిగా మారింది. డ్రెయిన్లను ఆక్రమించి మూసివేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా స్పందించి సమస్యను పరిష్కరించాలి. –వెంకట్‌రెడ్డి, తిరుమలగిరి


