నాగార్జునసాగర్: వినాయక నిమజ్జనం కోసం నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. బుధవారం సాయంత్రానికి 14 మైలు వరకు నీరు చేరేందుకు గాను మధ్యాహ్నం 2,765 క్యూసెక్కుల నీటిని వదిలారు. మూడు వేల క్యూసెక్కుల మేరకు నీటిని విడుదల చేయనున్నట్లుగా అధికారులు తెలిపారు. సాగర్ జలాశయం నీటిమట్టం గరిష్టంగా 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 535.80 అడుగులు (179.6902టీఎంసీలు)గా ఉంది. కుడి కాల్వకు నీటిని నిలిపివేశారు. ఎస్సెల్బీసీకి 2,000 క్యూసెక్కులు, వరద కాల్వకు 300 క్యూసెక్కులతో కలిపి మొత్తం 5,065 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. అంతే నీరు ఎగువ నుంచి వచ్చి జలాశయంలో చేరుతుందని అధికారులు తెలిపారు.
జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్(సద్దుల చెరువు) వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. బందోబస్తును, విగ్రహాల నిమజ్జన తీరును ఎస్పీ కె.నరసింహ పరిశీలించారు. సిబ్బందికి సూచనలు చేశారు. చెరువు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాతో పాటు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పట్టణంలో జరుగుతున్న శోభాయాత్రను ఎస్పీ పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ హన్మంతరెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ వెంకటయ్య ఉన్నారు.
సూర్యాపేటటౌన్ : నవరాత్రులు భక్తుల పూజలందుకున్న గణనాథుడు బుధవారం గంగమ్మ ఒడికి చేరాడు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వినాయక నిమజ్జన శోభాయాత్ర కనుల పండువగా సాగింది. యువత తీన్మార్ స్టెప్పులతో అదరగొట్టగా, మహిళలు కోలాటాలతో అలరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా వినాయక నిమజ్జన కార్యక్రమం కొనసాగింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాత్రి వరకు విగ్రహాల నిమజ్జనాలు జరిగాయి. వెళ్లి రావయ్య గణపయ్య అంటూ భక్తులు భక్తి పారవశ్యంతో గణేషుడిని నీటి వనరుల్లో నిమజ్జనం చేశారు. ఉదయం నుంచే నిమజ్జన సందడి కనిపించింది. మొదట వినాయకుడి లడ్డూలకు వేలం పాట నిర్వహించారు. మరికొన్ని ప్రాంతాల్లో గణేష్ మండపాల వద్ద లక్కీ డ్రా ఏర్పాటు చేయగా చివరిరోజు డ్రా తీసి విజేతలకు బహుమతులు అందించారు
ప్రముఖుల పూజలు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో మొదట పూలసెంటర్ వద్ద శ్రీవేదాంత భజన మందిరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొలి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభయాత్రను ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని మిగతా విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. పూల సెంటర్‌లో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ నివేదిత, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, అన్నపూర్ణ, భానుపురి ఉత్సవ సమితి సభ్యులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పూజల్లో పాల్గొని శోభాయాత్రను ప్రారంభించారు.
రూ.3.21లక్షలు పలికిన లడ్డూ
జిల్లా కేంద్రంలోని పూల సెంటర్ వద్ద భానుపురి ఉత్సవ కమిటీ, వేదాంత భజన మందిరం ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద లడ్డూకు వేలం పాట నిర్వహించారు. పట్టణానికి చెందిన బెలిదె శ్రీనివాస్ రూ.3.21లక్షలకు వేలం పాడి లడ్డూను దక్కించుకున్నాడు.
2వేలకు పైగా విగ్రహాల నిమజ్జనం
జిల్లా వ్యాప్తంగా 3150 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. అందులో బుధవారం ఆయా ప్రాంతాల్లో సుమారు 2వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు అధికారులు అంచనా వేశారు. పట్టణంతో పాటు పలు గ్రామాల్లో కొంత మంది గురువారం, శుక్రవారం కూడా నిమజ్జనం చేయనున్నారు. జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువుతో పాటు సూర్యాపేట మండలం రత్నపురం వద్ద గల మూసీ రిజర్వాయర్, కోదాడ పెద్ద చెరువు వద్ద, మట్టపల్లి బ్రిడ్జి, పాలకవీడు మండలం కృష్ణానది మహంకాళిగూడెం వద్ద, నేరేడుచర్ల పరిధిలోని చిల్లేపల్లి బ్రిడ్జి వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనం నిర్వహించారు. అర్థరాత్రి వరకు నిమజ్జన ప్రక్రియ కొనసాగింది.
సూర్యాపేట సద్దుల చెరువు వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనం


