అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి

Sep 24 2026 2:36 AM | Updated on Sep 24 2026 2:36 AM

నడిగూడెం : అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని పంచాయతీ రాజ్‌శాఖ ఈఈ వెంకటయ్య సూచించారు. బుధవారం మండల కేంద్రంలో నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ కట్ట వెంట రూ.35 లక్షలతో నిర్మిస్తున్న ప్లాస్టిక్‌ వ్యర్థాల ప్లాంట్‌, నడిగూడెంలో రూ.30 లక్షలతో నిర్మిస్తున్న ఫుడ్‌ గ్రెయిన్‌ ప్లాంట్‌, చెన్నకేశ్వాపురంలో రూ.15 లక్షలతో నిర్మిస్తున్న బీసీ కమ్యూనిటీ హాల్‌ పనులను ఆయన పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట డీఈ హర్ష, ఏఈ లావణ్య ఉన్నారు.

ఐవీఓ రాష్ట్ర అధ్యక్షుడిగా మధుసూదన్‌

కోదాడరూరల్‌ : ఇండియన్‌ వెటరన్స్‌ ఆర్గనైజేషన్‌(ఐవీఓ) రాష్ట్ర అధ్యక్షుడిగా కోదాడకు చెందిన రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి గుండా మధుసూదన్‌రావు నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు జేఎస్‌ సెంగార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మధుసూదన్‌రావు కోదాడలో వంద అడుగుల జాతీయ జెండాను ఏర్పాటుతో పాటు ప్రజల్లో దేశభక్తిని పెంపునకు పలు కార్యక్రమాలు చేపట్టారు.

లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం

మఠంపల్లి: మట్టపల్లిలోని రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం అర్చకులు స్వామివారి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేశారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్యప్రాశన, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈఓ చలపతి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

మేకల అభినవ్‌ నేటి యువతకు ఆదర్శం

కోదాడరూరల్‌ : క్రీడా స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన అంతర్జాతీయ చెస్‌ క్రీడాకారుడు మేకల అభినవ్‌ను యువత ఆదర్శంగా తీసుకొని క్రీడల్లో రాణించాలని పెరిక కార్పొరేషన్‌ చైర్మన్‌ దొంగరి వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎర్నేని కుసుమ పిలుపునిచ్చారు. బుధవారం అభినవ్‌ 25వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెస్‌ క్రీడలో రాణించి కోదాడ పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన అభినవ్‌, చిన్న వయసులోనే మృతి చెందడం ఈ ప్రాంతానికి తీరని లోటన్నారు. కార్యక్రమంలో అభినవ్‌ తల్లిదండ్రులు మేకల వెంకటేశ్వర్లు, అరుణ, దొంగరి శ్రీనివాస్‌, సీహెచ్‌.లక్ష్మీనారాయణరెడ్డి, దేవరపల్లి మల్లీశ్వరి, ముత్తవరపు పాండురంగారావు, ఎండీ.సలీంషరీఫ్‌, ఎస్‌కే.బషీర్‌, నయీం, కందులకోటేశ్వరరావు, తూనం కృష్ణ, గంధం పాండు, శ్రీను, నేహనావజ్‌ పాల్గొన్నారు.

నారసింహుడికి నిత్యారాధనలు

యాదగిరిగుట్ట రూరల్‌: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహాస్వామి వారి ఆలయంలో నిత్యపూజలను శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు బుధవారం నిర్వహించారు. వేకువజామునే స్వామి వారిని మేల్కొల్పిన అర్చకులు, ప్రధానాలయంలోని స్వయంభువులకు సుప్రభాత సేవ చేపట్టారు. బిందెతీర్థం, నిజాభిషేకం, ఆరాధన, అర్చనలు చేశారు. ప్రధానాలయం ముఖమండపంలోని ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన సేవలు నిర్వహించారు. ప్రాకార మండపాల్లో సుదర్శన నారసింహా హోమం, నిత్యకల్యాణం జరిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement