కోదాడ (మోతె) : మోతె మండలం రంగాపురంతండాకు వెళ్లే రోడ్డు కంకరమయంగా మారడంతో తండావాసులు అష్టకష్టాలు పడుతున్నారు. కంకరపై నుంచి వెళ్లలేక ఇరుకై న కాల్వ కట్టపై, చెర్వు కట్టపై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. 2022లో ఎస్‌డీఎప్ నిధులతో నర్సింహాపురం నుంచి రంగాపురంతండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1.73 కోట్లు మంజూరయ్యాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నిధులు మంజూరైన ఏడాది తర్వాత పనులు ప్రారంభించాడు. కానీ రహదారి నిర్మాణంలో నాణ్యత పాటించడం లేదని, రోడ్డు విస్తరించకుండా మట్టి రోడ్డుపైనే కంకర పరిచి తారు వేస్తున్నారంటూ తండా వాసులు పనులు అడ్డుకున్నారు. ఇది జరిగి సంవత్సరం గడుస్తున్నా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. మూడు కిలో మీటర్ల వరకు కంకర పరిచి వదిలేయడంతో రాళ్ల దారిపైనుంచి వెళ్లలేక ప్రజలు నరక యాతన పడుతున్నారు. తండాలో అత్యవసర పరిస్థితులు తలెత్తితే కనీసం అంబులెన్స్ వచ్చేందుకు కూడా అవకాశం లేదని తండా వాసులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పనులు పూర్తి చేయించాలని కోరుతున్నారు.


