● మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
నడిగూడెం : రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించాలని కోరుతూ ఆదివారం మండలంలోని కరివిరాల విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులతో రైతులు ఇబ్బందులు పడుతున్నా, సాగుకు విద్యుత్ కూడా సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. ఈ విషయమై రైతులు ఆందోళనలు చేపడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దున్నపోతుపై వర్షం పడినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. ఇప్పటికే పలు గ్రామాలలో బోర్లు, బావుల్లో సరిపడా నీరులేక వాటి కింద సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. రైతులకు నిరంతరం విద్యుత్ అందించి వారిని ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పల్లా నర్సిరెడ్డి, మండల సమన్వయకర్త అనంతుల ఆంజనేయులు, కరివిరాల సర్పంచ్ మారోజు పార్వతమ్మ, మాజీ జెట్పీటీసీ మార్తి ఉపేందర్, నాయకులు గార్లపాటి శ్రీనివాసరెడ్డి, నలమాద నారాయణరావు, కమల్‌రెడ్డి, రణబోతు రామిరెడ్డి, మేకల వీరబాబు, రైతులు పాల్గొన్నారు.


