పోలీసులకు సమాచారం ఇవ్వండి..
సూర్యాపేటటౌన్ : గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం కృషిచేస్తోంది. గంజాయి వినియోగం యువత, విద్యార్థుల భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుంటున్నాం. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలోనూ డ్రగ్స్ నియంత్రణ, గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేక బృందాలతో నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని ఎస్పీ నరసింహ వెల్లడించారు. శుక్రవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన పలు విషయాలు ఆయన మాటల్లోనే..
అన్ని శాఖల సమన్వయంతో..
ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రాంతాల నుంచి జిల్లాలోకి గంజాయి రవాణా కాకుండా అంతర్‌రాష్ట్ర మార్గాల్లో తనిఖీలు పెంచడంతోపాటు అనుమానాస్పద వాహనాలు, వ్యక్తుల కదలికలను నిశితంగా పరిశీలిస్తూ నిఘా పెట్టాం. ఇతర శాఖలు, సంబంధిత ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ గంజాయి సరఫరా గొలుసును ఛేదించేలా చర్యలు చేపడుతున్నాం.
ఈ ఏడాది 23 కేసులు నమోదు
ఇటీవల కోదాడ, హుజూర్‌నగర్ ప్రాంతాల్లో భారీగా గంజాయి పట్టుబడిన ఘటనల్లో కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశాం. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు గంజాయికి సంబంధించి 23 కేసులు నమోదు చేసి, 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం, మొత్తం 91 మందిని అరెస్టు చేసి జైలు పంపించాం.
అనుమానితులకు పరీక్షలు
గంజాయి వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అనుమానం ఉన్న వ్యక్తులను పోలీస్ స్టేషన్లకు పిలిపించి అవసరమైన సందర్భాల్లో యూరిన్, బ్లడ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. వారు గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారా లేదా అన్నది పరీక్షల ద్వారా నిర్ధారించుకుని తదనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. గంజాయి విక్రేతలపై మాత్రమే కాకుండా వినియోగదారులపైనా నిఘా కొనసాగుతుంది. ముఖ్యంగా యువత, విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా జిల్లాలో పోలీస్ భరోసా కార్యక్రమం ద్వారా విద్యాసంస్థల్లో విద్యార్థులకు గంజాయి, డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, స్నేహితుల వర్గం, కదలికలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నాం.
టోల్ ఫ్రీ నంబర్ 1933
స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూమ్ 8712686026
ఫ సరఫరా, వినియోగంపై
ప్రత్యేక నిఘా
ఫ అనుమానితులకు డ్రగ్ పరీక్షలు
ఫ ఈ ఏడాదిలో 40 కిలోల
గంజాయి స్వాధీనం
ఫ 23 కేసులు..91 మంది అరెస్ట్
‘సాక్షి’ ఇంటర్వ్యూలో
ఎస్పీ నరసింహ
గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి సంబంధించి సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు తెలియపర్చాలి. తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. జిల్లాలో గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా చేయడమే పోలీసుల లక్ష్యం. గంజాయి, డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ తమ సహకారం అందించాలి.


