భానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ట్రైకార్–గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఉఫాది పొందాలని కల్లెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ కోరారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు, ఇతర కోర్సులను మధ్యలో ఆపివేసిన వారు అర్హులని పేర్కొన్నారు. ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో వివిధ కోర్సుల్లో 3 నుంచి 6 నెలల పాటు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని తెలిపారు. ఆసక్తి గల వారు ఈనెల 25 వరకు ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహం కోదాడ(ఎ) (సెల్ : 9912739723), ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహం సూర్యాపేట (సెల్:9505767833)లో తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని కోరారు.
22ఏ జాబితా నుంచి భూములు తొలగించాలి
భానుపురి (సూర్యాపేట) : 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న అర్హులైన రైతుల భూములను తొలగించి న్యాయం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతారెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ ప్రేమ్‌రాజ్‌ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూములపై హక్కులు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాలు, ఇతర లావాదేవీలు జరగక జిల్లాలో వేలాది మంది రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రంగినేని రుక్మారావు, రాష్ట్ర టీచర్స్ సెల్ కన్వీనర్ తీకుళ్ల సాయిరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు చలమల్ల నరసింహ, దోసకాయల పని నాయుడు, ఉపాధ్యక్షుడు బండపల్లి పాండురంగాచారి, బీజేవైఎం మోర్చా జిల్లా అధ్యక్షుడు గునుగంటి పృథ్వీగౌడ్, నాయకులు మన్మథరెడ్డి, బాలాజీ నాయక్, దాసరి వెంకన్న, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణమ్మకు హారతి
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు పవిత్ర కృష్ణానదికి పసుపు, కుంకుమ, గాజులు, చీరె సారెతో హారతి ఇచ్చారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ చలపతిరావు, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు భక్తులు పాల్గొన్నారు.


