సూర్యాపేట : సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ వచ్చేంత వరకు తమ పోరాటం ఆగదని మున్సిపల్ మాజీ చైర్మన్ జుట్టు కొండ సత్యనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష కమిటీ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపి మాట్లాడారు. సూర్యాపేటకు రైలుమార్గం సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ దీక్షలో పాల్గొన్న తెలంగాణ ఆడబిడ్డల వేదిక నాయకురాలు వెలుగు వనిత ఆధ్వర్యంలో మహిళలు దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షకు ప్రైవేట్ విద్యా సంస్థల సంఘం ఆధ్వర్యంలో 40 మంది విద్యా సంస్థల యజమానులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రెటరీ పెద్దిరెడ్డి కళ్యాణ్ చక్రవర్తి, కార్యదర్శి నేరెళ్ల మధు, సీపీఎం నేత మట్టిపల్లిసైదులు, మైబు, షామియా సుగుణ శాంత మలాంబ, పద్మ, సహేనా తదితరులు పాల్గొన్నారు.


