పంట మార్పిడి ద్వారా భూమికి
ఉపశమనం, రైతుకు లాభం
రైతులు ఆరుతడి వైపు ఆలోచన చేయాలి
భానుపురి (సూర్యాపేట) : వానాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తోంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా లోటు వర్షపాతమే నమోదైంది. రానున్న రోజుల్లోనూ వర్షాలు కురిసే అవకాశాలు లేనందున రైతులు వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలి. లేదంటే నష్టపోయే అవకాశం ఉంది. ఈమేరకు రైతులను ఆరుతడి పంటల వైపు మళ్లించేందుకు జిల్లా యంత్రాంగం ‘రైతులతో మాట – పంట మార్పిడికి బాట’ పేరుతో ఈనెల 10న స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఈనెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో భాగంగా అధికారులు రైతులను కలిసి ఎల్‌నినో పరిస్థితులను వివరించనున్నారు. ఇప్పటివరకు సాగులోకి రాకుండా మిగిలిపోయిన 2.21 లక్షల ఎకరాల భూముల్లో ఆరుతడి పంటలను సాగు చేయించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
4.73,656 ఎకరాలకు గాను..
2026– 27 వానాకాలం సీజన్‌లో అత్యధికంగా వరి 4,73,656 ఎకరాల్లో సాగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఎల్‌నినో పరిస్థితుల కారణంగా రుతుపవనాలు ప్రారంభమైన జూన్‌లో సాధారణ వర్షపాతానికి మించి వర్షం కురిసినా.. మెట్ట పంటలకే మేలు జరిగింది. జూలైలో 40 శాతం మేర లోటు వర్షపాతం ఉండగా ఆగస్టులో ఇప్పటివరకు 27 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో 97,566 ఎకరాల్లో సాగు కావాల్సిన పత్తి 81 వేల ఎకరాల్లోనే సాగైంది. ఇక 4,73,656 ఎకరాల్లో సాగు కావాల్సిన వరి ఇప్పటివరకు 1.20 లక్షల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి.
2.21 లక్షల ఎకరాలే లక్ష్యంగా
ప్రతి ఏటా బోరు బావుల కింద సాగయ్యే వరి పంటలు సగం కూడా సాగులోకి రాలేదు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కలిపి దాదాపు 2.21 లక్షల ఎకరాల భూమి నాటు పడకుండా మిగిలిపోయినట్టు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. ఈ భూమిలో వరికి బదులుగా ఆరుతడి పంటలైన పెసర, కంది, మినుములు, కూరగాయలు, మొక్కజొన్న, వేరుశనగ పంటలను సాగు చేయించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం రైతులతో మాట– పంట మార్పిడికి బాట పేరుతో పది రోజులపాటు అధికారులు రైతులను నేరుగా కలుస్తున్నారు. ఒక్కో అధికారి రోజుకు పది మంది చొప్పున రైతులను కలిసి ఆరుతడి పంటల గురించి వివరిస్తున్నారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వ్యవసాయ అధికారులే కాకుండా రెండు రోజులుగా కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ సైతం వ్యవసాయ క్షేత్రాల బాట పట్టారు. మరో వారం రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుండగా జిల్లా యంత్రాంగం చేపడుతున్న ఈ వినూత్న కార్యక్రమం ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తుందో వేచి చూడాల్సిందే.
ఫ ఆరుతడి పంటల సాగుపై
రైతులకు అవగాహన
ఫ ఈనెల 20వరకు కొనసాగనున్న స్పెషల్ డ్రైవ్
ఫ మిగిలిపోయిన 2.21 లక్షల
ఎకరాల్లో ప్రత్యామ్నాయ
పంటల సాగే లక్ష్యం
ఫ ఒక్కో అధికారి రోజుకు పది మంది రైతులను కలిసేలా ప్రణాళిక
హుజూర్‌నగర్ : పంట మార్పిడి వ్యవసాయం ద్వారా భూమికి ఉపశమనం, రైతులకు లాభం కలుగుతుందని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. బుధవారం హుజూర్‌నగర్ మండలంలోని లక్కవరం, శ్రీనివాసపురం గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న కూరగాయలు, ఉద్యానవన పంటలను ఆయన పరిశీలించారు. శ్రీనివాసపురంలో ప్రొఫెసర్ డాక్టర్ పారుపల్లి శ్రీనివాసరావు వ్యవసాయ క్షేత్రంలో డ్రాగన్ ఫ్రూట్ తోటను పరిశీలించారు. లక్కవరం శివారులో రైతు పాశం వెంకటరెడ్డి రెండు ఎకరాల్లో బీర, మిర్చి, బెండకాయ, వంకాయ, సొర, బంతిపూల తోటలను కలెక్టర్ పరిశీలించారు. వారు పంటలు వేస్తున్న తీరును అడిగి తెలుసుకొని అభినందించారు. ఒకే పంట వేసి నష్టపోయే కంటే, ఇలా విభిన్న పంటలు వేయడం ద్వారా నిరంతరం ఆదాయం పొందవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ఆయన వెంట ఆర్డీఓ శ్రీనివాసులు, ఏడీఏ రవి, ఏఓ స్వర్ణ, తహసీల్దార్ కవిత, ఉద్యానవన శాఖ అధికారి ప్రదీప్తి, హెచ్‌ఈఓ ఇస్మాయిల్ తదితరులున్నారు.
రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. వరి సాగు చేసి నష్టపోకుండా ఆరుతడి పంటల వైపు ఆలోచన చేయాలి. అన్ని రకాల ఆరుతడి పంటల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.
– శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి


