హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్‌లోని పెండింగ్‌లో ఉన్న మోడల్ కాలనీ ఇళ్ల నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. బుధవారం హుజూర్‌నగర్‌లో రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న మోడల్ కాలనీ ఇళ్లను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఇళ్లలో చిన్నచిన్న లోపాలను గుర్తించి, వాటిని సరిచేయాలని కాంట్రాక్టర్లు, అధికారులకు ఆదేశించారు. ఇళ్లతోపాటు, డ్రెయినేజీ, తాగునీరు, రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పన పనులను వేగవంతం చేయాలన్నారు. ఇళ్ల సముదాయం ప్రాంగణంలో మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవన పునాది పనులు, డైనింగ్ హాల్ నిర్మాణాలు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. వీటితో పాటు అంగన్‌వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ల నిర్మాణ పనులకు ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయిస్తున్నట్లు వివరించారు. మోడల్ కాలనీ ఇళ్ల పంపిణీకి ఆర్డీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా ప్రాథమికంగా 1,805 మంది అర్హులైన లబ్ధిదారులతో జాబితాను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. దీనిపై వచ్చిన అభ్యంతరాలను, ఫిర్యాదులను ప్రత్యేక బృందాల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నామని తెలిపారు. అర్హత లేని వారి పేర్లు ఉంటే తొలగిస్తామని, నిజమైన పేదలకు మాత్రమే ఇళ్ల కేటాయిస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ శ్రీనివాసులు హౌసింగ్ పీడీ జబ్బర్ హేహ్మద్, తహసీల్దార్ కవిత, మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్, వివిద శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు, సిబ్బంది ఉన్నారు.
సౌకర్యాలు మెరుగు పరుస్తాం
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ గ్రంథాలయంలో సౌకర్యాలు మెరుగు పరిచేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. బుధవారం పట్టణంలోని గ్రంథాలయాన్ని ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా గ్రంథాలయ పితామహుడు ఎస్‌ఆర్ రంగనాథన్ జయంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. గ్రంథాలయంలో విద్యార్థులు, నిరుద్యోగుల మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రంథాలయానికి వచ్చే పాఠకుల సంఖ్యకు అనుగుణంగా వసతులు పెంచాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ కవిత, లైబ్రరీ ఇన్‌చార్జి శ్రీధర్ రెడ్డి తదితరులున్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


