ఫ గ్రామంలో పాఠశాల
అభివృద్ధికి సంఘంగా ఏర్పడిన ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు
ఫ సొంత ఖర్చులతో
ఆటో, మౌలిక సౌకర్యాల కల్పన
గ్రామంలోని సుమారు 50 మంది ఉద్యోగులం ఏకమై సంఘంగా ఏర్పడి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నాం. ముఖ్యంగా విద్యాభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నాం. భవిష్యత్‌లో మా సంఘ సభ్యుల సంఖ్యను వందకు పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.
– పందిరి బ్రహ్మారెడ్డి,
ఉద్యోగుల సంఘం సభ్యుడు
మునగాల: తాము చదువుకున్న పాఠశాల మూతపడుతుందన్న ఆవేదన ఆ ఊరి ఉద్యోగుల్లో మార్పు తెచ్చింది. అందరూ కలిసికట్టుగా ఒకే తాటిపై నిలిచి జెడ్పీ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు, విద్యార్థులను పాఠశాలకు తీసుకువచ్చేందుకు ఉచితంగా ఆటో సౌకర్యం కూడా కల్పించారు. మునగాల మండలంలోని పాత ముకుందాపురం గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గి మూతపడే స్థాయికి చేరుకోవడంతో రెండేళ్ల క్రితం ‘సాక్షి దినపత్రిక’ ప్రచురించిన కథనం స్థానిక పూర్వ విద్యార్థులను ఆలోచింపజేసింది. ఇదే పాఠశాలలో చదువుకున్న కుత్బుల్లాపూర్ డీసీపీ నంద్యాల కోటిరెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ పందిరి శ్రీనివాసరెడ్డి స్పందించారు. గ్రామానికి చెందిన 50 మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులందరినీ సమీకరించి ఓ సంఘంగా ఏర్పడి పాఠశాలల అభివృద్ధికి నడుం బిగించారు. ఈక్రమంలో తొలుత పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు రూపొందించి గ్రామ ప్రజలను చైతన్యపరిచి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడంలో సఫలీకృతులయ్యారు. ఫలితంగా గతంలో ఉన్నత పాఠశాలలో 22 మంది ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 48కి చేరింది. ప్రాథమిక పాఠశాలలో 20 మంది విద్యార్థుల నుంచి 31 మందికి పెరిగింది.
రూ. లక్షన్నరతో మౌలిక వసతులు
ఉద్యోగుల సంఘం తమ వంతుగా సుమారు రూ.లక్షన్నర వెచ్చించి పాఠశాల భవనాలకు పెయింటింగ్‌లు వేయించారు. మినీ మినరల్ వాటర్ ప్లాంట్, ప్రింటర్, కంప్యూటర్లను సమకూర్చారు. ముకుందాపురం గ్రామం పాత, కొత్త, మధ్య ఊరుగా విడిపోయి ఉండగా.. ఉన్నత పాఠశాల మధ్య ఊరిలో ఉంది. కొత్త, పాత ఊరి నుంచి పిల్లలు కిలోమీటరు దూరం నడిచి రావాల్సి వస్తున్న ఇబ్బందిని గుర్తించిన సంఘం.. సొంతంగా నెలకు రూ.10వేలతో ప్రత్యేకంగా ఒక ఆటోను ఏర్పాటు చేసి ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులను ఉచితంగా బడికి తీసుకొచ్చి వదిలే సదుపాయం కల్పించింది. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో నాణ్యమైన విద్య కోసం రెండేళ్లుగా నెలకు రూ.12వేల వేతనంతో విద్యా వలంటీర్‌ను నియమించారు.
ఇతర అభివృద్ధి కార్యక్రమాలు
కేవలం విద్యే కాకుండా, గ్రామాభివృద్ధిని కూడా ఉద్యోగులు తమ భుజాన వేసుకున్నారు. గ్రామంలో శివాలయం నిర్మాణం కోసం రూ. 50 లక్షల విరాళాలు సేకరించి స్థలం కొనుగోలు చేశారు. రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, భవిష్యత్‌లో సంఘాన్ని మరింత విస్తరిస్తామని సభ్యులు తెలిపారు.


