ఏసీ కోచ్‌ ఇస్తామని.. లగ్జరీ బస్సులు తీసేశారు! | - | Sakshi
Sakshi News home page

ఏసీ కోచ్‌ ఇస్తామని.. లగ్జరీ బస్సులు తీసేశారు!

Aug 12 2026 3:16 AM | Updated on Aug 12 2026 3:16 AM

సంస్థ నిర్ణయం తీసుకుంది లగ్జరీ బస్సులు వెనక్కి తీసుకు రావాలి

దూర ప్రయాణం చేసే

ప్రయాణికులకు ఇబ్బందులు

ఆర్టీసీ అధికారుల

తీరుపై స్థానికుల ఆగ్రహం

కోదాడ ఆర్టీసీ డిపోలో ఉన్న 9 సూపర్‌లగ్జరీ బస్సులను తీసుకొని, వాటి స్థానంలో 14 ఇతర బస్సులను ఇచ్చారు. కోదాడ డిపో విజయవాడ– హైదరాబాద్‌ మధ్యలో ఉండడంతో లగ్జరీ బస్సులను ఆపరేట్‌ చేయడం సంస్థకు లాభదాయకంగా లేదు. ఇతర బస్సులతో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాము.

– శ్రీనివాసరావు, డిపో మేనేజర్‌, కోదాడ

కోదాడ, హుజూర్‌నగర్‌ ప్రాంత వాసులకు అవసరమైన బస్సులను కోదాడ డిపోద్వారా ఏర్పాటు చేయాలి. లగ్జరీ బస్సులను వెంటనే వెనక్కి తీసుకు రావడంతో పాటు గతంలో మంత్రుల ఇచ్చిన హామీ మేరకు రాజధాని బస్సును అందుబాటులోకి తీసుకురావాలి. అవసరమైన బస్సులే లేనప్పుడు కోట్ల రూపాయలతో బస్టాండ్ల నిర్మాణం దండగే. – రాయపూడి చిన్ని,

ప్రజాచైతన్య వేదిక కన్వీనర్‌, కోదాడ

‘‘ కోదాడ ఆర్టీసీ డిపోకు రాజధాని ఏసీ బస్సును మంజూరు చేస్తున్నాము. కోదాడ, హుజూర్‌నగర్‌ ప్రజలు ఉదయం ఏసీ బస్సు ఎక్కి హైదరాబాద్‌కు వచ్చి నన్ను కలిసి సాయంత్రం అదే ఏసీ బస్సులో కోదాడ, హుజూర్‌నగర్‌కు చేరుకోవచ్చు.’’

ఇది సంవత్సరం క్రితం రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి కోదాడ బస్టాండ్‌ను

సందర్శించిన సమయంలో చేసిన ప్రకటన.

కోదాడ : కోదాడ ఆర్టీసీ డిపోకు ఏసీ బస్సులు మంజూరు చేస్తామంటూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చలేదు. పైగా ప్రస్తుతం డిపోలో ఉన్న 9 సూపర్‌ లగ్జరీ బస్సులను సైతం సంస్థ అధికారులు ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. వాటి స్థానంలో సాధారణ బస్సులను పంపడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

దూర ప్రయాణికులకు ఇబ్బందే..

కోదాడ డిపోలో ఉన్న సూపర్‌లగ్జరీ బస్సులు కోదాడ నుంచి బయలుదేరి హుజూర్‌నగర్‌ మీదుగా హైదరాబాద్‌కు వెళ్తుండేవి. దాంతో వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లే కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉండేది. ఆర్టీసీ అధికారులు వీటిని రద్దు చేయడంతో హైదరాబాద్‌కు వెళ్లేందుకు విజయవాడ నంచి వచ్చే ఏపీ బస్సులపైనే ఆధారపడాల్సి వస్తున్నది. ఇవి పైనుంచే ప్రయాణికులతో నిండిపోయి ఉండడంతో స్థానికులకు సీట్లు దొరక్క నిలబడి ప్రయాణించాల్సి వస్తున్నది. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో సమయం ఎక్కువగా పడుతుండడం, రద్దీ అధికంగా ఉంటుండడంతో దూర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వచ్చిన బస్సు వెనక్కి..

సంవత్సరం క్రితం మంత్రుల ఇచ్చిన హామీ మేరకు కోదాడ డిపోకు ఒక రాజధాని ఏసీ బస్సును అధికారులు పంపించారు. ఈ బస్సును మంత్రి ప్రారంభిస్తారని అప్పట్లో అధికారులు ప్రకటించారు. దాంతో తమకు ఏసీ బస్సు అందుబాటులో వస్తుందని కోదాడ, హుజూర్‌నగర్‌ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. కానీ రాజధాని బస్సును ప్రారంభించకుండా.. నాలుగు నెలల పాటు కోదాడ డిపోలో ఉంచిన అధికారులు దానిని వెనక్కి పంపించారు. ప్రస్తుతం డిపోలో ఉన్న సూపర్‌లగ్జరీ బస్సులను సైతం తీసివేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కోట్ల రూపాయలతో బస్టాండ్ల నిర్మాణం

ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడానికి హుజూర్‌నగర్‌లో రూ.4 కోట్లతో, కోదాడలో రూ.26 కోట్లతో కొత్త బస్టాండ్ల నిర్మాణానికి నెల రోజుల క్రితం మంత్రులు శంకుస్థాపన చేశారు. ప్రసుత్తం కోదాడ డిపోలో 60 ఆర్టీసీ బస్సులు, 30 అద్దెబస్సులు ఉన్నాయి. ప్రయాణికుల అవసరాలకు సరిపడ బస్సులు లేనప్పుడు కోట్ల రూపాయలతో బస్టాండ్లు నిర్మించడం ఎందుకని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. కోదాడ, హుజూర్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని, ఈ విషయమై మంత్రి జోక్యం చేసుకొని కోదాడ నుంచి హుజూర్‌నగర్‌ మీదుగా సూపర్‌లగ్జరీ, రాజధాని బస్సులను నడిపించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement