కళాశాల విద్యార్థులందరికీ నోటు పుస్తకాలు
హుజూర్‌నగర్ : ప్రభుత్వ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం నోట్‌బుక్స్ పంపిణీ చేస్తోంది. ఇంటర్ విద్యను సర్వశిక్ష అభియాన్‌కింద చేర్చడంతో పాఠశాల విద్యార్థుల మాదిరిగానే ఇంటర్ పిల్ల లకు సైతం ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు ఒక్కొక్కరికి 200 పేజీల 12 నోట్‌బుక్స్ అందిస్తోంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలలకు ఇప్పటికే నోట్ పుస్తకాలను పంపింణీ చేశారు. ఆయా కళాశాలల ప్రిన్స్‌పాల్స్ వాటిని విద్యార్థులకు అందిస్తున్నారు.
8 కళాశాలలకు సరఫరా
సూర్యాపేట జిల్లాలో మొత్తం 8 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. సూర్యాపేట, నడిగూడెం, తుంగతుర్తి, కోదాడ, నేరేడుచర్ల, హుజూర్‌నగర్, నెమ్మికల్, తిరుమలగిరిలో ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో సుమారు 3,452 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒక్కోక్క విద్యార్థికి 12 నోటు పుస్తకాల చొప్పున మొత్తం 41,424 బుక్స్‌ను ప్రభుత్వం జిల్లాకు సరఫరా చేసింది. ఇటీవల డీఐఈఓ సులోచనారాణి విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీని ప్రారంభించారు. ప్రస్తుతం ఆయా కళాశాలల ప్రిన్స్‌పాల్స్ వాటిని విద్యార్థులకు అందిస్తున్నారు. మరి కొన్ని చోట్ల ఈ నెల 15న అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నోటు పుస్తకాల పంపిణీతో విద్యార్థులపై రూ.800లకు పైగా ఆర్థిక భారం తగ్గనుంది.
త్వరలో మధ్యాహ్న భోజనం
ఈ విద్యా సంవత్సరం నుంచి జూనియర్ కళాశాలల్లో డిజిటల్ ప్యానల్ బోర్డులపై బోధన ప్రారంభించారు. దాంతో పాటు ప్రయోగ పరీక్షలకు సైతం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. త్వరలోనే జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం కూడా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా న్యూట్రిషన్ కమిటీలను ఏర్పాటు చేసి వారి పర్యవేక్షణలో ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది.
ఫ ఒక్కొక్కరికి 12 చొప్పున అందజేత
ఫ 8 కళాశాలలకు
41,424 బుక్స్ పంపిణీ
ప్రభుత్వ కళాశాల విద్యార్థులందరికీ ప్రభుత్వం ఇంటర్ బోర్డు ద్వారా నోటు పుస్తకాలు సరఫరా చేసింది. జిల్లాలోని 8 జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థికి 12 నోట్‌బుక్స్ చొప్పున పంపిణీ చేస్తున్నాం. కాలేజీల్లో చదివే విద్యార్థులకు త్వరలో బ్యాగులు, షూస్ కూడా అందిస్తాం.
– బి. సులోచనారాణి, డీఐఈఓ, సూర్యాపేట


