సూర్యాపేట : సూర్యాపేట జిల్లా ప్రజలు రైలు సౌకర్యం కోసం ఐదు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారని బుల్లెట్ ట్రైన్‌సాధన సమితి కన్వీనర్ ఆరుట్ల జానకిరెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సూర్యాపేట వంటి ప్రధాన వాణిజ్య, విద్యా, పారిశ్రామిక కేంద్రాన్ని బుల్లెట్ ట్రైన్‌న్ అలైన్‌న్‌మెంట్ నుంచి తొలగించడం ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను దెబ్బతీసిందని పేర్కొన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధించేందుకు అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎన్. సోంబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ అనిల్‌కుమార్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి, టప్రా జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నె యాదగిరి, నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపెల్లి సైదులు, వెంకటయ్య, వెలుగు రమేష్, చిలుక రమేష్, డి.లాలు, పాపిరెడ్డి, ఎన్. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహునికి నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి ఆలయంలో మంగళవారం రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీనరసింహుని నిత్యకల్యాణాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హోమశాలలో నిత్యఅగ్నిహోత్రి చేపట్టారు. గర్భాలయంలో స్వామివారి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. నిత్యకల్యాణంలో భాగంగా విష్వక్సేనపూజ, రుత్విగ్వరణం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో ఘనంగా నిర్వహించారు. క్షేత్రపాలకుడైన వీరాంజనేయస్వామికి నాగవళ్లీ దళాలతో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ చలపతిరావు, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, వంశీ కృష్ణమాచార్యులు, సాయికుమారాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
తక్కువ నీటితో పండే
పంటలు సాగు చేయాలి
పెన్‌పహాడ్ : ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలనే సాగు చేయాలని జడ్పీ సీఈఓ శిరీష అన్నారు. మంగళవారం మండలంలోని దోసపహాడ్ గ్రామంలో నిర్వహించిన రైతుల అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. వరి పంటకు ప్రత్యామ్నాయంగా మినుములు, కందులు, అలసంద, జొన్నలు, కూరగాయాలు పండించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జానయ్య, ఏఈఓ మురళి, పంచాయతీ కార్యదర్శి జాని, ఉప సర్పంచ్ రాము పాల్గొన్నారు.
నీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
తిరుమలగిరి(తుంగతుర్తి) : ఎల్‌నినో ప్రభావంతో మున్సిపాలిటీ పరిధిలో నీటి ఎద్దడి సమస్య ఏర్పడితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ సంకెపల్లి రఘునందన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో జరుగనున్న బోనాలు, వినాయక చవితి పండుగల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ ఏమోజు గోవిందమ్మ రవీందర్, మున్సిపల్ కమిషనర్ సీహెచ్.వెంకన్న, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


