సూర్యాపేటటౌన్ : సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళికతో పని చేస్తున్నట్లు ఎస్పీ నరసింహ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం సూర్యాపేట డివిజన్ స్థాయి పోలీసు అధికారుల నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. గత నెలలో నమోదైన కేసుల వివరాలు, పోలీసు దర్యాప్తు, కేసుల పురోగతిని సమీక్షించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, బాధితుల సమస్యను త్వరగా పరిష్కరించాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, కేసులు పెండింగ్‌లో ఉండొద్దని ఆదేశించారు. అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, డీసీఆర్‌బీ డీఎస్పీ రవి, డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు వెంకటయ్య, నాగేశ్వరరావు, ఉపేందర్‌రావు, రాజశేఖర్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


