కోదాడ : ప్రభుత్వ స్థలాలను కాపాడుతామని.. అంగుళం కూడా ఆక్రమణకు గురైన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. డిస్ట్రిక్ట్ టౌన్ ప్లానింగ్ కమిటీ (డీటీపీసీ) లేఅవుట్ చేసిన రోడ్డునే తప్పుడు సర్వే నంబర్‌తో దొడ్డిదారిని విక్రయించినా.. దీనిపై అధికారులు కనీస విచారణ చేసిన దాఖలాలు లేవు.
అసలు విషయం ఏమిటంటే..
కోదాడ పట్టణ పరిధిలోని సర్వే నంబర్ 149లో నాగుబండి పద్మయ్యకు భూమి ఉంది. 1959లో నాగార్జునసాగర్ ఎడమ కాలువ తవ్వకం సమయంలో సిబ్బంది క్వార్టర్స్, గెస్ట్‌హౌస్‌ల నిర్మాణాలకు ఈ సర్వే నంబర్ నుంచి ప్రభుత్వం 3.06 ఎకరాల భూమిని సేకరించింది. ఈ స్థలానికి తూర్పున జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న రెండు ఎకరాల స్థలాన్ని పద్మయ్య 1963లో కోదాడ ప్రభుత్వ వైద్యశాల నిర్మాణానికి రిజిస్టర్ దానపత్రం ద్వారా ఇచ్చారు. ఈ స్థలాన్ని డీటీపీసీ వారు లేఅవుట్ చేసి వైద్యశాల భవనాన్ని నిర్మించారు. ఎన్‌ఎస్‌పీ, దాత ఇచ్చిన వైద్యశాల స్థలాలకు మధ్య 30 అడుగుల రోడ్డు ఏర్పాటు చేశారు. ఈ రోడ్డునే తప్పుడు సర్వే నంబర్(208) వేసి అమ్మగా దానిలో కొందరు భవనాలు నిర్మించుకున్నారు.
ఫిర్యాదులు చేస్తున్నా విచారణే లేదు
డీటీపీసీ లేఅవుట్ రోడ్డును తప్పుడు సర్వే నంబర్‌తో అమ్ముకున్న వారి వారసుల్లో ఒకరు తమ భూమిని ప్రభుత్వమే ఆక్రమించిందని తప్పుడు సర్వే రిపోర్టులతో ఎన్‌ఎస్‌పీలో 20 గుంటల స్థలాన్ని అక్రమంగా పొందారని, మరొకరు ప్రభుత్వ వైద్యశాలలో తాము ఇచ్చిన రెండు ఎకరాలకు ఎక్కువగా స్థలం ఉందని 520 గజాల స్థలాన్ని తీసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని పట్టానికి చెందిన పలువురు గడిచిన 20 ఏళ్లుగా ఫిర్యాదులు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒకే సర్వే నంబర్ 149లో ఉన్న ఎన్‌ఎస్‌పీ స్థలానికి, ప్రభుత్వ వైద్యశాల స్థలానికి మధ్యలోకి సర్వే నంబర్ 208 ఎలా వచ్చిందని కనీస విచారణ చేసేవారు కరువయ్యారని ఫిర్యాదుదారులు వాపోతున్నారు.
ప్రభుత్వ వైద్యశాల స్థలంలోనూ ఇదే తంతు..
కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు దాత ఇచ్చిన రెండు ఎకరాల స్థలం కంటే ప్రస్తుతం 20 గుంటలు తక్కువగా ఉంది. అయినా సర్వే అధికారులు వైద్యశాల స్థలానికి తూర్పు రోడ్డును కూడా వైద్యశాల స్థలంగా కొలుస్తున్నారు. ఈ స్థలం తమదేనని దాత వారసులు 1991లో కోర్టుకు వెళ్లగా అది గ్రామపంచాయతీ రోడ్డు అని కోర్టు తీర్పునిచ్చింది. అయినా అధికారులు ఈ రోడ్డును కూడా కొలిచి ఇచ్చిన తప్పుడు రిపోర్టులతో దాత వారసులకు కోదాడ ప్రభుత్వ వైద్యశాల కాంపౌండ్ లోపల రెండు ఎకరాల కన్నా ఎక్కువ స్థలం ఉందని దాదాపు 520 గజాల స్థలాన్ని అధికారులు అప్పజెప్పారు. ప్రస్తుతం వైద్యశాల లోపల ఎకరం 20 గుంటలు మాత్రమే ఉందని రిపోర్టు ఇస్తున్న అధికారులు మిగిలిన 20 గుంటల ఎటుపోయిందో చెప్పడం లేదు.
ఫ 30 అడుగుల రోడ్డులో
18 అడుగుల ఆక్రమణ
ఫ తప్పుడు సర్వే నంబర్‌లో విక్రయం
ఫ 20 ఏళ్లుగా ఫిర్యాదు చేస్తున్నా
కనీస చర్యలు శూన్యం
ఇది కోదాడ పట్టణంలోని సర్వే నంబర్ 149లోని ప్రభుత్వ వైద్యశాలకు పడమర, ఎన్‌ఎస్‌పీ స్థలానికి తూర్పున ఉన్న 30 అడుగుల రోడ్డు. ఈ స్థలాన్ని గతంలో వైద్యశాల నిర్మాణానికి దానమివ్వగా దాత వారసుడు నాగుబండి వీరయ్య ఈ 30 అడుగుల రోడ్డును 18 అడుగుల మేర ఆక్రమించి ఇది సర్వే నంబర్ 208లో ఉన్నట్లు చెప్పి రిజిస్టర్ డాక్యుమెంట్స్ 1815, 1816 ద్వారా 495 గజాల స్థలాన్ని అమ్ముకున్నాడు. సర్వే నంబర్ 149లో ఎన్‌ఎస్‌పీ స్థలం, ప్రభుత్వ వైద్యశాల ఉండగా ఈ రెండింటి మధ్యలోకి సర్వే నంబర్ 208 ఎలా వచ్చిందో అర్థకాని పరిస్థతి.


