హుజూర్‌నగర్ : కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది ఆదరణే ఉన్నత ఉద్యోగికి గుర్తింపునిస్తాయని విద్యుత్ శాఖ ఎస్‌ఈ అమరబోయిన శ్రీనివాస్, డీఈ వెంకటకిష్టయ్య అన్నారు. బదిలీ అయిన ఎస్‌ఈ అమరబోయిన శ్రీనివాస్, డీఈ వెంకట కిష్టయ్యలకు శనివారం హుజూర్‌నగర్‌లో డివిజన్ ఆర్టిజన్ కార్మికుల ఆధ్వర్యంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని శాలువాలు, పూల మాలలతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి బదిలీలు సహజం అన్నారు. అనంతరం నూతన డీఈ రామ్మోహన్‌రెడ్డికి స్వాగత సన్మానం చేశారు. కార్యక్రమంలో హుజూర్‌నగర్ ఏడీఈ గోవింద్, కోదాడ ఏడీఈ వెంకన్న, ఏఈలతో పాటు డివిజన్ బాడీ కమిటీ సభ్యులు వెంకట నరసింహ చార్యులు, పిడతల శ్రీనివాస్, నిమ్మా ప్రభాకర్, మట్టపల్లి, హఫీజ్, వీరభద్రం, వేణు, పబ్బు మల్లయ్య, జోనస్‌రెడ్డి, ఉసిరికాయల సైదులు, ఆర్టిజన్ కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు.
మట్టపల్లిలో నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శనివారం విశేష పూజలు కొనసాగాయి. ఆలయంలో ముందుగా సుప్రభాత సేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం జరిపి నిత్య కల్యాణాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆ తర్వాత శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. చివరగా నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కాగా శుక్రవారం రాత్రికే ఆలయానికి చేరుకున్న రెండు తెలుగు రాష్ట్రాల భక్తులు తెల్లవారుజాముననే పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ టి.చలపతిరావు, అర్చకులు పాల్గొన్నారు.
బుల్లెట్ ట్రైన్ సాధనకు ఉమ్మడి పోరు సాగిద్దాం
సూర్యాపేట : జాతీయ రహదారి–65 వెంట ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మార్పుపై 20 రోజులుగా చేస్తున్న ఉద్యమాన్ని ఉమ్మడిగా సాగిద్దామని బుల్లెట్ ట్రైన్ సాధన కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఆరుట్ల జానకిరెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేటలోని మహావీర్ బ్యాంకెట్ హాల్లో జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. పట్టణంలో రైల్వే లైన్ సాధన సమితి పేరుతో సాగుతున్న మరో ఉద్యమ కమిటీ కన్వీనర్ డేగల జనార్దన్ రాచూరు ప్రతాప్‌తో అఖిలపక్ష కమిటీ చర్చలు జరిపారు. రెండు సంఘాల కలిసికట్టుగా పోరా టాలు కొనసాగించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య సలహాదారు రమణాచారి, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, టీజేఎస్ రాష్ట్ర నాయకులు కుంట్ల ధర్మార్జున్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనుములపురి రవి, కునుకుంట్ల సైదులు, మట్టిపల్లి సైదులు, జర్నలిస్ట్ భూపతి రాములు, సట్టు నాగయ్య ఆవుల నాగరాజు, ధనియాకుల శ్రీకాంత్, పేర్ల నాగయ్య, మాధవరెడ్డి, గట్ల రమాశంకర్, బూర వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
నేడు సమన్వయం సమావేశం
సూర్యాపేట : జాతీయ రహదారి వెంట ఉన్న ముఖ్య పట్టణాలు, మండల కేంద్రాలకు చెందిన రైల్వేలైన్ సాధన సమితి సభ్యులతో ఆదివారం ఉదయం 11 గంటలకు సూర్యాపేటలోని పబ్లిక్ క్లబ్‌లో సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు బుల్లెట్ రైలు సాధన కమిటీ కన్వీనర్ ఆరుట్ల జానకిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి సూర్యాపేటలోని వ్యాపారులు, అన్ని రకాల ఉద్యమ సంఘాల ప్రతినిధులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.


