వర్షాలు కురవాలని
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా–గోదావరి నదులు జలకళ సంతరించుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నాగార్జునసాగర్‌లో మహావరుణ యాగాన్ని తలపెట్టింది. ఈ నెల 10వ తేదీన నాగార్జునసాగర్ జలాశయం ఒడ్డున విజయవిహార్ ఆవరణలో ఈ మహాయాగం నిర్వహించనున్నారు. యాగంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా పాల్గొననుండగా, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా హాజరుకానున్నారు.
లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో..
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ మహా వరుణయాగం నిర్వహించనున్నారు. దేవస్థాన పాలకమండలి ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఇంతటి స్థాయిలో వరుణయాగం నిర్వహిస్తుండడం విశేషం. యాగం విజయవంతం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టగా, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి యాగ నిర్వహణ బాధ్యతలను అప్పగించింది.
10వ తేదీ మధ్యాహ్నం..
ఈనెల 10వ తేదీన మధ్యాహ్నం నుంచి యాగ కార్యక్రమాలు ప్రారంభమై, సాయంత్రం 3.20 నుంచి 3.24 గంటల మధ్య పూర్ణాహుతి నిర్వహించనున్నారు. ఈ మహాయాగంలో 108 మంది ఋత్విక్కులు, వేద పండితులు, అర్చక బృందం వర్ష పాశుపత వరుణ యాగంలోని విశేష మంత్రాలతో 11 హోమ గుండాల్లో ప్రత్యేక వేద మంత్రోచ్ఛరణల మధ్య హోమాలు నిర్వహించనున్నారు.
ముమ్మరంగా ఏర్పాట్లు..
ప్రస్తుతం ఇతర ప్రాజెక్టుల్లోకి వరద జలాలు చేరుతున్నప్పటికీ, శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌కు ఇంకా ఆశించిన స్థాయిలో నీటి ప్రవాహం ప్రారంభం కాలేదు. దీంతో సాగర్ ఇంకా డెడ్ స్టోరేజ్‌కే పరిమితమై ఉంది. మరో వారం రోజుల్లో శ్రీశైలం జలాశయం నిండితే సాగర్‌కు నీటి విడుదల ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యాగాన్ని తలపెట్టింది. ఇప్పటికే జిల్లా అధికారులు, దేవాదాయ, ఇరిగేషన్, పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారులు యాగ వేదిక వద్ద ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రత, రాకపోకలు, వాహన పార్కింగ్, వేదిక, విద్యుత్, తాగునీరు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ ఏర్పాట్లను కలెక్టర్ చంద్రశేఖర్ కూడా పరిశీలించారు.
విజయ విహార్‌లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్
యాగం నిర్వహణపై అర్చకులతో చర్చిస్తున్న కలెక్టర్
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం పూర్తిగా తొలగిపోయి, విస్తారంగా వర్షాలు కురవాలని, రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని, జలాశయాలు నిండాలని ప్రభుత్వం ఈ యాగాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ముఖ్యంగా కృష్ణా, గోదావరి పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందేలా జలాశయంలో సమృద్ధిగా నీరు చేరాలనే సంకల్పంతో ప్రత్యేక పూజలు చేపడుతున్నారు.
నాగార్జునసాగర్‌లో 10వ తేదీన నిర్వహణ
ఫ వర్షాలు కురవాలని యాగం తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
ఫ స్వయంగా పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి
ఫ ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా అధికారులు


