చేయూతకు దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

చేయూతకు దరఖాస్తులు

Aug 8 2026 1:11 AM | Updated on Aug 8 2026 1:11 AM

కొన్నింటికి ప్రాధాన్యం

భానుపురి (సూర్యాపేట) : చాలా కాలంగా చేయూత పింఛన్‌ కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పంద్రాగస్టు నుంచి ఇవ్వనున్న కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. గతంలో లబ్ధిదారులు ఇచ్చిన దరఖాస్తుల స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలియకపోవడం... అర్హులకు పెన్షన్‌ అందాలన్న భావనతో నేటి నుంచి అర్జీలను స్వీకరించనున్నారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, డీఆర్‌డీఓలు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో పింఛన్‌ ప్రక్రియకు సంబంధించిన ఆన్‌లైన్‌ లాగిన్లు ఓపెన్‌ అయ్యాయి. ఆగస్టు 15 నాటికి అర్హులను ఎంపిక చేసి, సెప్టెంబర్‌లో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం జిల్లాలో 1,56,000 మందికి ప్రతినెలా పింఛన్లు అందుతున్నాయి. మరెందరో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు.

గతంలో ఇచ్చిన వారు సైతం

పింఛన్‌ కోసం అర్హులు గతంలో ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన ఫార్మాట్‌లోనే దరఖాస్తు చేయడం తప్పనిసరి. గతంలో ప్రజాపాలన, మీ–సేవ కేంద్రాల్లో లేదా సాధారణ తెల్ల కాగితాలపై దరఖాస్తు చేసిన వారు కూడా ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన కొత్త ఫార్మాట్‌లోనే వివరాలు సమర్పించాలి. గతంలో దరఖాస్తులతో పాటు ఇచ్చిన కులం, ఆదాయం, ఇతర ధ్రువీకరణ పత్రాలకు కొత్త దరఖాస్తు ఫారాన్ని జత చేసి సమర్పిస్తే సరిపోతుంది.

దరఖాస్తులు ఎక్కడివ్వాలి..

గ్రామీణ ప్రాంతాల వారైతే గ్రామపంచాయతీలు, ఎంపీడీఓ కార్యాలయంలో అందించాల్సి ఉంటుంది. పట్టణ ప్రాంతాల వారు మున్సిపాలిటీలో ఇవ్వాలి. లబ్ధిదారుల ఆన్‌లైన్‌ నమోదుకు వీలుగా దరఖాస్తుదారుని బ్యాంకు ఖాతా సంఖ్య, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌, సమగ్ర వ్యక్తిగత వివరాలను కొత్త ఫారంలో పొందుపరిచి ఇవ్వాలి. గ్రామాల్లో స్వీకరించిన దరఖాస్తులను ఎంపీడీఓలు, పట్టణ ప్రాంతాల్లో స్వీకరించిన వాటిని మున్సిపల్‌ కమిషనర్లు పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. అనంతరం ఆన్‌లైన్‌ చేసిన దరఖాస్తులను డీఆర్‌డీఓ ద్వారా కలెక్టర్‌ పరిశీలనకు పంపిస్తారు. కలెక్టర్‌ పరిశీలన అనంతరం తుది ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపుతారు.

ముగింపు తేదీ లేదు

పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు నిర్దేశిత గడువు లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది నిరంత ప్రక్రియ అని, అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోచ్చని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వం అన్ని రకాల పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించనున్నప్పటికీ ప్రభుత్వం ముందుగా ఏడు రకాల పింఛన్లకే ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో వితంతువులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్‌ బాధితులు, పైలేరియా (బోధకాలు) బాధితులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, దివ్యాంగులు ఉన్నారు. వృద్ధాప్య, బీడీ కార్మికుల పింఛన్ల దరఖాస్తులు తర్వాతి దశలో ఇవ్వనున్నారు. తలసేమియా, సికిల్‌ సెల్‌ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి పింఛన్లు ఇవ్వనున్నారు.

కొత్త పింఛన్ల మంజూరుకు నేటి నుంచే స్వీకరణ

ఫ ఆగస్టు 15 నాటికి ఎంపిక..

సెప్టెంబర్‌లో పంపిణీ

ఫ ముందుగా ఏడు రకాల పింఛన్లకే ప్రభుత్వం ప్రాధాన్యం

ఫ అర్జీల స్వీకరణకు నిర్దేశిత గడువు లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement